‘ఎనిమిదేండ్లలో మోదీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు. పేదలను కొట్టి పెద్దోళ్లకు పంచడమే దానికి తెలిసిన విద్య. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ దుష్ట పాలనను ఎండగట్టాల్సిన సమయం ఆసన్నమైంది’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఫ్యూడల్ రాజకీయాలు చేస్తూ, ఎన్నికల కోసం బీజేపీ కుల, మత కల్లోలాలు సృష్టిస్తూ దేశాన్ని మధ్య యుగానికి తీసుకెళ్లి అరాచకం చేస్తున్నదని మండిపడ్డారు. రిజర్వేషన్ల పెంపు బిల్లుపై కేంద్రం గిరిజనులను మోసం చేస్తున్నదని పేర్కొన్నారు. పంజాబ్, హర్యానా రాష్ర్టాల మాదిరిగా తెలంగాణలోనూ పూర్తిస్థాయిలో వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటింటికీ వెళ్లి బీజేపీ కుట్రలను వివరించాలని, అందుకు సీఎం కేసీఆర్ ఏ పిలుపు ఇచ్చినా టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కోరారు.
సూర్యాపేట, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : రైతుల కోసం సీఎం కేసీఆర్ మరో ఉద్యమం చేపట్టారని, అందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. పేదోళ్లను కొట్టి పెద్దోళ్లకు సంపదను పంచడమే బీజేపీకి తెలిసిన విద్య అని, ఎన్నికల కోసం కుల, మత రాజకీయాలతో రాక్షసానందం పొందుతూ దేశానికి రజాకార్లలా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక సుమంగళి ఫంక్షన్ హాల్లో సూర్యాపేట నియోజకవర్గస్థాయి టీఆర్ఎస్ సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగిస్తూ ప్రపంచంలోనే అనేక దేశాల కంటే తెలంగాణ అగ్రభాగాన ఉందని, దేశంలో ఏ రంగంలో చూసిన తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉందన్నారు. ఇది ఎవరో చెప్పిన విషయం కాదని, స్వయానా అనేక మార్లు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని గుర్తు చేశారు.
దేశంలో పేదరికాన్ని పెంచడం.. పెద్దోళ్లకు పంచడమే బీజేపీకి తెలిసిన విద్య అని మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల ఆదాయాలు ఉన్న సంస్థలను ప్రైవేట్ వారికి అప్పగించడమే అందుకు నిదర్శనం అన్నారు. ఇక పేదోళ్లకు నిలువ నీడ లేకుండా చేసేందుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, సెస్‌ల పెంపు, రైతుల మోటర్లకు విద్యుత్ మీటర్లు బిగించడం కార్పొరేట్ దిగ్గజాల లబ్ధి కోసమే అన్నారు.
బీజేపీ ఫ్యూడల్ సిద్ధాంతాలను అవలంబిస్తూ దేశానికి రజాకార్లుగా మారారని మంత్రి ధ్వజమెత్తారు. ఎప్పుడో 60, 70 ఏండ్ల క్రితం నాటి కశ్మీర్ గాయాన్ని రెచ్చగొట్టడం, మతాలు, కులాల మధ్య కుంపటి పెట్టేవారిని రజాకార్లు కాకుండా మరేమనాలన్నారు. ఎనిమిదేండ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిలో శూన్యం, సంక్షేమంలో మైనస్ ర్యాంకులో ఉందని తెలిపారు.
బీజేపీ మతాల పేరిట కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తూ గుడి పేరున ఓట్లు అడుక్కునే దుర్మార్గమైన ఆలోచనలు చేస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ యాదాద్రి దేవాలయాన్ని నిరిస్తున్నారని, దాంతో ఇప్పటి వరకు ఏమైనా రాజకీయం చేశారా, ఓట్లు ఓట్లు అడిగారా అన్నారు. దేశానికి మోదీ ఏం చేశారని ప్రశ్నిస్తే? అబద్ధాలు చెప్పడం వారి నైజంగా మారిందని, అబద్ధాలపై పునాదులు కడితే ఏ నిర్మాణం ఉండదని, అలాగే బీజేపీకి కాలం దగ్గర పడిందన్నారు.
తెలంగాణను సాధించిన వ్యక్తి సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధానికి వస్తున్నాడని, అది రైతుల సమస్యలతోనే ప్రారంభమైందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆకలి లేదు. నీళ్ల కరువు లేదు. విద్యుత్ సమస్య లేదు. ఇలా ప్రజలకు ఎలాంటి సమస్య లేదంటే ప్రజల మందు మనం ఎంతో గర్వంగా ఉంటున్నామని టీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి అన్నారు. 2001లో రాష్ట్రం కోసం గులాబీ జెండా ఎత్తితే అందరూ వచ్చారు. నేడు దేశం కోసం, దేశ రైతుల కోసం కేసీఆర్ ఉద్యమం షురూ అయ్యిందని, కేంద్రం వైఫల్యాలను, మన అభివృద్ధిని రైతులకు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశాన్ని బీజేపీ కబంధ హస్తాల నుంచి విముక్తి కోసం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పంజాబ్, హర్యానా తదితర రాష్ర్టాల మాదరిగా తెలంగాణతోపాటు ఇతర అన్ని రాష్ర్టాల నుంచి రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకుడు వై.వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రాజా, గుడిపూడి వెంకటేశ్వర్రావు, అంగిరేకుల నాగార్జునతోపాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎనిమిదేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశాన్ని మధ్య యుగానికి తీసుకెళ్తుందని మంత్రి దుయ్యబట్టారు. మధ్య యుగంలో అనేక కారణాలతో మనుషులు కొట్టుకోవడాలు, చంపుకోడాలు ఉండేవన్నారు. అలాగే నేడు బీజేపీ కూడా కులాలు, మతాలు, జాతుల మధ్య వైరాలు పెంచుతుందని ఆరోపించారు. 20 ఏండ్ల బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అభివృద్ధి లేదని, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాల వైపు దేశ ప్రజలు చూస్తున్నారని పేర్కొన్నారు.