తిరుమల : వసంత పంచమి పర్వదినం సందర్భంగా తిరుమల( Tirumala ) లోని శ్రీవారి ఆలయంలో శుక్రవారం వార్షిక విశేష పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీవారి ఆలయంలోని కళ్యాణ మండపంలో అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చతుర్దశ కలశావాహనం గావించి పుణ్యహవచనం, వివిధ క్రతువులను నిర్వహించారు.
గతంలో శ్రీవారి ఆలయంలో ప్రతి సోమవారం వారపు సేవగా విశేషపూజను నిర్వహించేవారు. శ్రీవారి ఉత్సవమూర్తుల అరుగుదలను అరికట్టి భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఏడాదికోసారి మాత్రమే అభిషేకం నిర్వహించాలనే జీయంగార్లు, అర్చకులు, ఆగమ పండితుల సూచన మేరకు వసంతోత్సవం, సహస్ర కలశాభిశేకం, విషేశపూజను నిర్వహిస్తున్నారు.
ఈ మేరకు గత ఏడాది నుంచి వసంత పంచమి రోజున శ్రీవారి ఆలయంలో వార్షిక విశేషపూజను ఏకాంతంగా నిర్వహిస్తుందని టీటీడీ అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.