YS Sharmila : కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపే అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఈ నెల 18న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని ఆశావహులంతా ఎంపీ పదవి కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 136 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. దాంతో ఆ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ కనీసం ముగ్గురిని రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. ఆ ముగ్గురిలో ఒకరిగా ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పేరు కూడా పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. ఇటీవల ఆమె పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో సమావేశమై ఇదే విషయమై చర్చించినట్ తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభ సభ్యత్వం ముగియనుండటంతో ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వటం దాదాపు ఖరారైంది. ఇటీవలే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్యకు కూడా రాజ్యసభ సీటు ఆఫర్ చేసినా ఆయన నిరాకరించారు. రాష్ట్రంలో డీకే సర్కారు ఏర్పాటు కానున్న తరుణంలో.. కొత్త మంత్రివర్గంలో చోటుదక్కని సీనియర్లు ఉంటే వారిలో ఒక రాజ్యసభ సీటు ఆఫర్ చేసే అవకాశం ఉంది. మరోవైపు సిద్ధరామయ్య సతీమణి పార్వతికి రాజ్యసభ్య అవకాశం ఇవ్వాలని అధిష్ఠానం యోచిస్తోంది. ఈ నెల 18న నిర్వహించే రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సోమవారం నోటిఫికేషన్ వచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో అభ్యర్థుల పేర్లను త్వరలో వెల్లడిస్తామని మల్లికార్జున ఖర్గే తెలిపారు.