జగద్గిరిగుట్ట, ఆగస్టు 5: క్షేత్రస్థాయి సమస్యలు గుర్తించి ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన తెలిపారు. కుత్బుల్లాపూర్ జోన్ రోడామిస్త్రీనగర్‌లో బుధవారం వన్డే-వన్వార్డ్లో భాగంగా కాలనీల ప్రజలు, సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సీసలబస్తీ, శ్రీనివాసనగర్ , రింగుబస్తీ, లెనిన్‌నగర్, భగత్సింగ్మార్గ్ ప్రాంతాల్లో రోడ్డు నిర్మించాలని పలువురు కోరారు. జగద్గిరిగుట్ట ఔట్పోటస్ట్ వద్ద సిగ్నల్, చైతన్య విద్యానికేతన్ చౌరస్తా, మఖ్థూంనగర్ మసీద్ , రింగుబస్తీ, లెనిన్‌నగర్‌లో వీధి దీపాలు, హైమాస్‌లైట్లు ఏర్పాటు చేయాలని ప్రస్తావించారు.
లెనిన్‌నగర్, ఎన్టీఆర్నగర్, సీసలబస్తీ, ఉమాదేవినగర్‌లో డ్రైనేజీ, నాలా పనులు చేపట్టాలని కోరారు. శ్రీనివాసనగర్, మఖ్థూనగర్, లెనిన్‌నగర్ ప్రాంతాల్లో పార్కు, ఓపెన్‌స్పేస్ అభివృద్ధి చేయాలని వినతి వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆయా విభాగాల అధికారులతో అంచనాలు రూపొందించి పనులు చేపడతామని కమిషనర్ స్థానికులకు తెలిపారు. జెడ్సీ పింకేష్‌కుమార్, డీసీ స్పందన, జగద్గిరిగుట్ట జేఏసీ చైర్మన్ శివరాత్రి యాదగరి, మాజీ కార్పొరేటర్ జగన్, కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు.