అమ్రాబాద్, ఆగస్టు 5 : మండలంలోని మన్ననూర్-శ్రీశైలం మార్గంలో ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించిన ప్రాథమిక సాంకేతిక పరిశీలనకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) అధికారులు , వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఐఐ)కు చెందిన సాంకేతిక నిపుణులు బుధవారం వచ్చి అమ్రాబాద్ టైగర్ రిజర్వును సందర్శించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో రేవంత్‌చంద్ర ఆధ్వర్యంలో దో మలపెంటలో సమావేశం ఏర్పాటుచేశారు.
అనుమతుల మేరకు ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ అలైన్మెంట్ లేఅవుట్ వెం ట ప్రాథమిక సర్వే, ప్రతిపాదిత కారిడార్ నిర్మాణం వల్ల వన్యప్రాణులు వాటి ఆవాసాలపై కలిగే ప్రభావాలను అంచనావేయడంతోపాటు ఎంత మేరకు అటవీ భూమి మళ్లింపునకు గురయ్యే అవకాశం ఉందనే అంశాలపై చర్చలు జరిపినట్లు డీఎఫ్‌వో తెలిపారు. కారిడార్ నిర్మాణ సమయంలో , నిర్మాణ అనంతరం వన్యప్రాణుల సంచారం, ఆవాసాలు, జీవవైవి ధ్యం , పర్యావరణ వ్యవస్థపై కలిగే ప్రభావాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎన్హెచ్ఏఐ అధికారులు, డబ్ల్యూఐఐ సాంకేతిక నిపుణులు, ఏటీఆర్కు చెందిన క్షేత్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.