Amarnath Yatra : పవిత్ర అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) అత్యంత భక్తి శ్రద్ధలతో విజయవంతంగా కొనసాగుతోంది. యాత్ర ప్రారంభమైన తొలి 11 రోజుల్లోనే దర్శించుకున్న భక్తుల (Devotees) సంఖ్య 2.75 లక్షలు దాటి మూడు లక్షలకు చేరువైంది. యాత్రికుల తాకిడి రోజురోజుకు క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఇవాళ అమర్నాథ్ను దర్శించుకున్న భక్తుల సంఖ్య మూడు లక్షలు దాటే అవకాశం ఉంది.
మంగళవారం జమ్మూ నుంచి 5,335 మంది భక్తులతో కూడిన మరో బృందం కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్నాథ్కు బయలుదేరింది. వీరిలో 3,599 మంది పహల్గామ్ బేస్ క్యాంపునకు, 1,736 మంది బల్తాల్ బేస్ క్యాంపునకు వెళ్తున్నారు. సోమవారం ఒక్కరోజే 24,259 మంది యాత్రికులు దర్శనం చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా ఈ యాత్రలో సోమవారం ఒక చిన్న రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
రాంబన్ జిల్లాలోని చందర్‌కోట్ సమీపంలో యాత్రికుల బస్సు బ్రేకులు విఫలం కావడంతో మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 18 మంది యాత్రికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారికి వెంటనే ప్రథమ చికిత్స అందించి, ప్రత్యామ్నాయ వాహనంలో ప్రయాణాన్ని కొనసాగించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మినహా యాత్ర ప్రశాంతంగా సాగుతోంది.
జూలై 3న ప్రారంభమైన ఈ 57 రోజుల సుదీర్ఘ యాత్ర శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్ పర్వదినమైన ఆగస్టు 28న ముగియనుంది. యాత్ర సురక్షితంగా సాగేందుకు సీఆర్పీఎఫ్, ఆర్మీ, స్థానిక పోలీసులతో సహా భద్రతా బలగాలు సమన్వయంతో పనిచేస్తూ పటిష్ఠమైన ఏర్పాట్లు చేశాయి.