Hyderabad | హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లులు మాల్లో ఓ వ్యక్తి గన్‌తో కనిపించడం కలకలం రేపింది. మాల్ పార్కింగ్ వద్ద రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చచెబుతుండగా పాతబస్తీకి చెందిన సిద్దిఖీ అనే వ్యక్తి జేబులో గన్ను పోలీసులు గుర్తించారు.
సిద్దిఖీ దగ్గర గన్ కనిపించడంతో అప్రమత్తమైన పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించారు. కాగా గన్‌కు చెల్లుబాటయ్యే లైసెన్స్ ఉన్నట్లు తేలింది. అయితే గన్‌తో వచ్చిన వ్యక్తిని మాల్‌లోకి అనుమతించడంలో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంపై పోలీసులు సీరియస్ అయ్యారు. మాల్‌లోకి ప్రవేశించేప్పుడు సరైన తనిఖీలు నిర్వహించకపోవడం వల్లే సదరు వ్యక్తి గన్‌తో లోపలికి రాగలిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన లులు మాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.