Artificial Intelligence | న్యూఢిల్లీ : టెక్ ఉద్యోగాల్లో చేరేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ వినియోగంలో ప్రావీణ్యం సాధించాలని ‘చాట్ జీపీటీ’ మాతృ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ కీలక సూచన చేశారు. ఇప్పటికే చాలా కంపెనీల్లో కోడింగ్ పనుల కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్నారని, ప్రస్తుతం అనేక కంపెనీల్లో 50%పైగా కోడింగ్ పనులను ఏఐ నిర్వహిస్తోందని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. టెక్ ఉద్యోగాల్లో చేరాలనుకునే విద్యార్థులంతా ఏఐతో కలిసి పనిచేయడం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
లేకుంటే జాబ్ మార్కెట్లో నిలదొక్కుకోవడం కష్టమవుతుందని హెచ్చరించారు. ఏఐలో నైపుణ్యం సాధించిన వారికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. మానవ కోడర్ల స్థానంలో ఏఐని ప్రవేశపెట్టాలన్న ఆలోచన నానాటికీ విస్తృతమవుతోందని, దీనికి అనేక మంది పారిశ్రామికవేత్తలు ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. మరో 6 నెలల్లో 90 శాతం కోడింగ్ పనులను ఏఐ చేయగలదని, ఈ ఏడాది చివరి నాటికి కోడింగ్‌లో మానవులను ఏఐ పూర్తిగా అధిగమించగలదని ‘ఆంథ్రోపిక్’ కంపెనీ సీఈవో అమోడీ వేసిన అంచనాలతో ఆల్ట్‌మన్ ఏకీభవించారు.