న్యూఢిల్లీ : స్మాల్ ఎస్యూవీ సెగ్మెంట్లో దూసుకురానున్న తమ నూతన వాహనానికి టాటా పంచ్ పేరును టాటా మోటార్స్ ఖరారు చేసింది. మహీంద్ర కేయూవీ 100 నెక్ట్స్, మారుతి సుజుకి ఇగ్నిస్‌లకు దీటుగా టాటా పంచ్ నిలవనుంది. ఆటో ఎక్స్పో 2020లో హెచ్2ఎక్స్ పేరుతో ప్రదర్శించిన స్మాల్ ఎస్‌యూవీని టాటా పంచ్ పేరుతో పండగ సీజన్లో భారత మార్కెట్లో టాటా మోటార్స్ లాంఛ్ చేయనుంది. కొద్దిరోజుల కిందట సోషల్ మీడియా ఖాతాల్లో ఈ ఎస్యూవీ టీజర్ వదిలిన కంపెనీ తాజాగా టాటా పంచ్ ఎలా ఉండబోతోందో వెల్లడించింది.
హెచ్2ఎక్స్ కాన్సెప్ట్‌ను పోలిన తరహాలో పంచ్ కనిపించనుంది. ఈ ఎస్యూవీ బుకింగ్స్‌ను టాటా మోటార్స్ త్వరలోనే ప్రారంభించనుంది. టాటా పంచ్ పేరుకు తగినట్టే ఎక్కడికి వెళ్లేందుకైనా అనువైన ఎనర్జిటిక్ వాహనమని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర పేర్కొన్నారు. టాటా పంచ్ అత్యాధునిక ఫీచర్లతో పాటు స్టన్నింగ్ డిజైన్, టెక్నాలజీ, డ్రైవింగ్ డైనిమిక్స్ల మేళవింపుతో ఆకట్టుకుంటుందని అన్నారు. తమ ఎస్యూవీ కుటుంబంలో పంచ్ నాలుగవ ఎడిషన్ అని ఆయన వెల్లడించారు.