Real Estate | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ నేలచూపులు చూస్తున్నది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు వేచిచూసే ధోరణిలో పడ్డారు. గ్రేటర్ పరిధిలో జరిగిన స్థిరాస్తి రిజిస్ట్రేషన్లపై ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ అధ్యయన సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదికే ఇందుకు అద్దం పడుతున్నది. గత ఏడాది మార్చిలో 6,959 రిజిస్ట్రేషన్లు జరిగితే, ఈ ఏడాది మార్చిలో 6,416 నమోదయ్యాయి. దీంతో 8 శాతం పడిపోయినైట్టెంది. ఈ ఏడాది ఫిబ్రవరితో చూసినా 10 శాతం క్షీణత కనిపిస్తున్నది. ఇక గతంలో జరిగిన అగ్రిమెంట్లతో రిజిస్ట్రేషన్లకు రావడం వల్లే ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్లు పెరిగాయంటున్నారు. నిరుడు డిసెంబర్‌తో పోల్చితే ఈ జనవరిలోనూ రిజిస్ట్రేషన్లు 25 శాతం తగ్గడం గమనార్హం.
సొంతింటి కలకు మధ్యతరగతి వర్గాలు దూరమైనట్టు తాజా గణాంకాల్లో స్పష్టమవుతున్నది. మొత్తం రిజిస్ట్రేషన్లలో నిరుడు మార్చితో చూస్తే.. ఈ ఏడాది మార్చిలో రూ. 25 లక్షలలోపు రిజిస్ట్రేషన్లు 18 శాతం నుంచి 14 శాతానికి దిగజారాయి. అలాగే రూ.25-50 లక్షలలోపు రిజిస్ట్రేషన్ల వాటా కూడా 53 శాతం నుంచి 45 శాతానికి పతనమైందని నైట్ ఫ్రాంక్ తమ రిపోర్టులో పేర్కొన్నది. ఇక 500-1,000 చదరపు అడుగుల్లోని నివాసాలకు డిమాండ్ గతంలో 17 శాతంగా ఉంటే, ఇప్పుడు 13 శాతంగానే ఉన్నది. ఈ పరిణామం మిడిల్ క్లాస్ కస్టమర్లు మార్కెట్‌కు దూరమయ్యారని చెప్పకనే చెప్తున్నది.