హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వైద్య కళాశాలలన్నీ పూర్తిస్థాయి వసతులతో పనిచేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. వైద్యారోగ్యశాఖపై కమాండ్ కంట్రో ల్ సెంటర్లో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కార్యాచరణ ప్రణాళికకు అధికారులతో కమిటీ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఆ కమిటీ ప్రతి కళాశాలను సందర్శించి అకడ కావాల్సిన అవసరాల నివేదికను సమర్పించాలని సూచించారు. జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) వైద్య కళాశాలలకు సంబంధించి లేవనెత్తిన వివిధ అంశాలపై చర్చించారు. నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ భాషను ఒక ఆప్షనల్‌గా నేర్పించాలని, జపాన్‌లో మన నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఉందని సీఎం తెలిపారు. దవాఖానలకు వచ్చే రోగులు, వారిని పరీక్షించే వైద్యులు, దవాఖానల సమయాల పర్యవేక్షణకు ఒక యాప్‌ను వినియోగించే అంశంపై అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. సమీక్షలో మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎస్ రామకృష్ణారావు, సీఎంప్రధాన కార్యదర్శి శేషాద్రి, కార్యదర్శి మాణిక్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.