హైదరాబాద్ : 2022-23 విద్యాసంవత్సరం బీటెక్ ఫస్టియర్ తరగతులు ( Btech first year classes ) అక్టోబర్ 10 నుంచి ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆదేశాలు జారీచేసింది. సవరించిన అకడమిక్ క్యాలెండర్‌ను శుక్రవారం ప్రకటించింది. తెలంగాణలో ఎంసెట్ జూలై 14 నుంచి 20 వరకు జరగనుండటం, పలు రాష్ట్రాల్లోనూ ఇంజినీరింగ్ అడ్మిషన్లు ఆలస్యం అవుతుండటంతో తరగతులు ప్రారంభించటం కష్టతరమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు ఏఐసీటీఈ అకడమిక్ క్యాలెండర్‌ను సవరించి ప్రకటించింది.
తరగతుల నిర్వహణపై విద్యాసంస్థలకే ఏఐసీటీఈ స్వేచ్ఛ ఇచ్చింది. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్, ఆన్లైన్ ప్లస్ ఆఫ్‌లైన్ (బ్లెండెడ్ మోడ్)లో నిర్వహించుకోవచ్చని సూచించింది. కొవిడ్ నిబంధనలు మాత్రం పాటించాలని ఆదేశించింది. అనుమతుల కోసం ఏఐసీటీఈ, యూజీసీ మార్గదర్శకాలను పాటించాలని పేర్కొన్నది.
సాంకేతిక విద్యాసంస్థల షెడ్యూల్ | తేదీలు |
ఏఐసీటీఈ నుంచి అనుమతులు పొందటం, తిరస్కరణలు | జూలై 10 |
అప్పీళ్లపై అనుమతులిచ్చేందుకు తుది గడువు | జూలై 30 |
యూనివర్సిటీలు, బోర్డుల నుంచి అనుమతులు పొందటం | ఆగస్టు 31 |
సాంకేతిక కోర్సుల్లోని ప్రస్తుత విద్యార్థులకు తరగతుల గడువు | సెప్టెంబర్ 15 |
బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇండక్షన్ నిర్వహించటం | అక్టోబర్ 10 |
బీటెక్‌లో సీట్ల రద్దుకు గడువు (పూర్తి ఫీజు వాపస్) | అక్టోబర్ 20 |
ఖాళీ సీట్లలో ఫస్టియర్ విద్యార్థులను చేర్చుకోవటం | అక్టోబర్ 25 |
ఫస్టియర్ క్లాసులను ప్రారంభించేందుకు తుది గడువు | అక్టోబర్ 25 |
సెకండియర్‌లో లాటరల్ ఎంట్రీకి గడువు | అక్టోబర్ 30 |
స్టాండలోన్, పీజీడీఎం, పీజీసీఎం విద్యాసంస్థలకు | తేదీలు |
ఏఐసీటీఈ నుంచి అనుమతులు పొందటం, తిరస్కరణలు | జూలై 10 |
అప్పీళ్లపై అనుమతులిచ్చేందుకు తుది గడువు | జూలై 30 |
అడ్మిషన్లు రద్దుచేసుకొనేందుకు గడువు (పూర్తి ఫీజు వాపస్) | సెప్టెంబర్ 13 |
అడ్మిషన్లు పూర్తిచేసేందుకు గడువు | సెప్టెంబర్ 20 |