Alampur | గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో కమీషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ బరితెగించారు. రూ.8 కోట్ల కమీషన్ ఇవ్వకుంటే చంపి పారేస్తామని మారణాయుధాలతో బెదిరించి నేషనల్ హైవే 44 కాంట్రాక్ట్ పనులను ఆపించారు. దీనిపై బాధితుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు కావడంతో సంపత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కంప్లయింట్ లెటర్‌ను పోలీసులు దాచేస్తున్నట్లు సమాచారం.
గద్వాల జిల్లా బీచుపల్లి – అలంపూర్ నేషనల్ హైవే 44పై ఆరు లేన్ల రోడ్డు విస్తరణ పనులను భ్రమర ఇన్ఫ్రా కంపెనీ దక్కించుకుంది. అయితే ఈ పనులు జరగాలంటే తనకు రూ.8 కోట్ల కమీషన్ ఇవ్వాలని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ అనుచరుడు ఆకేపోగు పీటర్సన్ బెదిరించాడు. జనవరి 6వ తేదీన రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న స్థలానికి TS33E6768 నంబర్ కారులో వెళ్లిన పీటర్సన్ మారుణాయుధాలతో బెదిరించాడు. దీంతో భ్రమర ఇన్ఫ్రా కంపెనీ భయపడి రోడ్డు విస్తరణ పనులను ఆపేసింది. దీనిపై ఆ కంపెనీ అధినేత జగదీశ్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేతల నుంచి ఆదేశాలు రావడంతో సంపత్, ఆయన అనుచరుడిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఫిర్యాదు కాపీలను కూడా పోలీసులు మాయం చేశారని సమాచారం.
కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగే జాతీయ రహదారి పనుల్లో కూడా కమీషన్లు కావాలంటూ సంపత్ ఒత్తడి చేస్తున్నారు. అలాగే నియోజకవర్గంలోని తుంగభద్ర నది నుంచి అక్రమంగా భారీ ఎత్తున ఇసుకను ఆక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక్కో టిప్పర్ నుంచి నెలకు రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. పోలీసులే దగ్గరుండి ఈ ఇసుక అక్రమ రవాణా చేయిస్తున్నారని అంటున్నారు. ఒకవేళ ఈ ఇసుక అక్రమ రవాణాకు సహకరించకపోతే సదరు పోలీసులను బదిలీ చేయిస్తున్నారని తెలుస్తోంది.

బెదిరింపుల తర్వాత కారులో వెళ్తున్న దృశ్యం