Mana Shankara Vara Prasad Garu | సాధారణంగా చిరంజీవి సినిమా అంటే అంచనాలు కామన్. దానికి తోడు ప్రత్యేక పాత్రలో వెంకటేశ్ తోడయ్యాడు. ఇంకేముందీ.. అంచనాలు అంబరాన్ని తాకాయి. విడుదలైన ప్రచార చిత్రాలన్నీ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక హిట్ మిషిన్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు కావడంతో విజయం తథ్యం అని జనాలంతా ఫిక్సయిపోయారు. ఇంతటి పాజిటివ్ వాతావరణం మధ్య ఎట్టకేలకు సోమవారం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సంక్రాంతికి వచ్చేశారు. మరి అందరి అంచనాలనూ ఆయన అందుకున్నారా? దర్శకుడు అనిల్ రావిపూడి హిట్ పరంపర ఎప్పటిలాగే కొనసాగిందా? గత సంక్రాంతి మాదిరిగానే ఈ సంక్రాంతికి కూడా హిట్ కొట్టేశాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
కేంద్రమంత్రి శర్మ(శరత్ సక్సేనా)కు ‘నిన్ను చంపేస్తున్నాం’ అంటూ ఓ హంతకుల గ్యాంగ్ నుంచి బెదిరింపు కాల్ రావడం.. ఆయన దగ్గర పనిచేస్తున్న నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ శంకర్వరప్రసాద్(చిరంజీవి) ఆ గ్యాంగ్‌ని తుదముట్టించడంతో కథ మొదలవుతుంది. శంకర్వరప్రసాద్ని శర్మ తన కుటుంబ సభ్యుడిగా చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ సరదాగా ఉండే శంకరప్రసాద్ మనసులో ఏదో బాధ ఉన్నదని గ్రహించిన శర్మ.. ఓ రోజు శంకరప్రసాద్ని కారణం అడగుతాడు. భార్యతో విడిపోవడం.. కన్నబిడ్డలకు దూరం కావడం.. ఇవే శంకర వరప్రసాద్ బాధకు కారణాలని శర్మకు అర్థమవుతుంది.
అందుకే ఓ బోర్డింగ్ స్కూల్లో చదువుకుంటున్న పిల్లల్ని కలుసుకునే ఏర్పాటు చేస్తాడు మినిస్టర్ శర్మ. ఆ స్కూల్లో పీఈటీగా జాయిన్ అయిన శంకర వరప్రసాద్.. తన పిల్లలకు ఎలా చేరువయ్యాడు? అసలు శంకరప్రసాద్ భార్యతో విడిపోవడానికి కారణం ఏంటి? చివరకు ఆ కుటుంబం ఎలా కలిసింది? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ

Mana Shankara Varaprasad4
కథగా చెప్పుకుంటే పెద్దగా కథేం కాదు. కానీ ఉన్న కథను క్యూట్‌గా.. ఎక్కడా అనవసరపు పాత్రలు కానీ, సన్నివేశాలు కానీ లేకుండా అర్థవంతంగా నడిపాడు దర్శకుడు అనిల్ రావిపూడి. సాధారణంగా ఇలాంటి కథలకు లాజిక్కులు వెతక్కూడదు. ఈ సినిమాలో కూడా కొన్ని లాజిక్ లేని విషయాలున్నా అవి ఆడియన్స్‌ని అంతగా ఇబ్బంది పెట్టవ్. ‘ఇలా ఎందుకు జరక్కూడదు?’ అనిపిస్తాయి. అపార్థం చేసుకొని విడిపోయిన భార్యకు తానేంటో అర్థం కావాలని తపించే భర్త కథ ఇది. దూరమైన బిడ్డలను అక్కున చేర్చుకోవాలని తహతహలాగే ఓ తండ్రి కథ ఇది. ఈ కథ చుట్టూ వినోదాన్ని మేళవించి జనరంజకంగా మలిచాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాల్లో కనిపించే క్రింజ్ కామెడీ ఈ సినిమాలో లేదు. అర్థవంతంగా, హాయిగా నవ్వుకునేలా కామెడీ ఉన్నది. ప్రధాన పాత్రల మధ్య ఏర్పాడే ఆయా పరిస్థితుల నుంచి పుట్టే కామెడీనే ఈ సినిమాలో ఆద్యంతం కనిపిస్తుంది. సిట్యువేషనల్ కామెడీ కావడంతో సినిమా ఎక్కడా విసుగు రాలేదు. ప్రథమార్ధం పాత్రల పరిచయాలు, హీరోహీరోయిన్లు కలవడం, విడిపోవడం, దానికి సంబంధించిన పరిస్థితుల నేపథ్యంలో సాగింది. సమస్యలు సీరియస్‌వే అయినా.. చెప్పడం మాత్రం వినోదంగా చెప్పాడు. ఈ కథలో విలన్ పాత్ర గురించి ప్రత్యేకించి చెప్పాలి. చిరంజీవి సినిమాల్లో విలన్ అంటే అత్యంత శక్తిమంతుడిగా, ప్రమాదకారిగా కనిపిస్తాడు. కానీ ఈ సినిమాలో ప్రధాన విలన్ ఓ కామన్ మ్యాన్ కావడం విశేషం. అతను విలన్‌గా మారే పరిస్థితులు కూడా లాజికల్‌గానే అనిపిస్తాయి. అసలు విలన్ కామన్ మ్యాన్ అవ్వడం వల్లే ఈ కథలో ఆసక్తి ఇంకాస్త పెరిగిందనాలి.
ద్వితీయార్ధం కొంతభాగం కాస్త సీరియస్ వేలో సాగినా.. చివరి 20 నిమిషాలు వెంకటేశ్ ఎంట్రీతో సినిమా మళ్లీ వినోదంవైపు టర్న్ తీసుకున్నది. వెంకీగౌడాగా తెరపై వెంకటేశ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఓ విధంగా ఆయన ఉన్నంతవరకూ తెరపై అందర్నీ డామినేట్ చేశారు. తెరపై చిరంజీవి, వెంకటేశ్ ఒకే ఫ్రేమ్‌లో సందడి చేయడం.. అభిమానులకే కాదు, సగటు ప్రేక్షకుడికి కూడా కన్నుల పండుగ అనిపించింది. మొత్తంగా ఈ సంక్రాంతికి మరో బ్లాక్‌బస్టర్ ఇచ్చేశారు అనిల్ రావిపూడి.

Mana Shankara Varaprasad1
శంకరవరప్రసాద్గా చిరంజీవి అభినయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి పాత్రలు ఆయన కేక్వాక్. ఎప్పటిలాగే తనదైన యాక్షన్, కామెడీ, ఎమోషన్స్‌తో ఆడియన్స్‌ని అలరించారు చిరంజీవి. సరదాగా ఉన్నప్పుడు ‘చంటాబ్బాయి’ని గుర్తు చేస్తూ.. అవసరమైనప్పుడు రౌడీ అల్లుడ్నీ, ఘరనామొగుడ్నీ యాదికి తెస్తూ.. పాటల్లో ‘కొండవీటి దొంగ’ను.. యాక్షన్‌లో ‘గ్యాంగ్ లీడర్’ని గుర్తు చేస్తూ వింటేజ్ మెగాస్టార్ తెరపై సాక్షాత్కరించారని చెప్పక తప్పదు.
ఇక ఇందులో చిరంజీవికి సమానమైన పాత్ర నయనతారది. ఆ పాత్రలో ఉండే దర్పం, అభిజాత్యాన్ని అద్భుతంగా పలికించింది నయనతార. ఆమె చేయడం వల్ల ఆ పాత్రకు నిండుదనం వచ్చిందని చెప్పొచ్చు. ఇక సచిన్ ఖేడేకర్ది ఇందులో కీలకమైన పాత్ర. ఎప్పటిలాగే తనదైన అభినయంతో ఆయన ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులంతా తమదైన పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక చివరిగా వెంకటేశ్… చివరి 20 నిమిషాలు ఆయన సినిమాలో కనిపిస్తారు. అప్పటివరకూ ఓ స్థాయిలో నడిచిన సినిమాను తన రాకతో పరుగులు పెట్టించాడు వెంకటేశ్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ నిజంగా సూపర్బ్. తను ఉన్నంతవరకూ తనే సినిమాకు హైలైట్. అందులో ఏమాత్రం సందేహం లేదు.

Mana Shankara Varaprasad3
ఈ సినిమాకు కర్త కర్మ క్రియ అనిల్ రావిపూడి. తన బాధ్యతను వందకు 90శాతం న్యాయం చేశారాయన. చిరంజీవితో సినిమా ఎలా తీయాలో చేసి చూపించాడు. ఎక్కడా క్రింజ్ కామెడీ లేకుండా, మెగా మార్క్ ైస్టెలిష్ కామెడీతో, మెగా మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో, మెగా మార్క్ ఎమోషన్స్‌తో ఫుల్ ప్యాక్డ్ మెగా ఎంటర్టైన్మెంట్ని సంక్రాంతి బరిలో దించారాయన. చిరంజీవి, వెంకటేశ్ పాత్రల్నీ ఆయన ట్యాకిల్ చేసిన తీరు మాత్రం నిజంగా అభినందనీయం. ఈ సినిమాలో అనిల్ రావిపూడి తర్వాత చెప్పుకోవాల్సింది ఎడిటింగ్ గురించే. చిరంజీవి వయసు ప్రభావం ఎక్కడా కనిపించకుండా, అతి జాగ్రత్తగా ప్రతి సీన్లోనూ ఎడిటర్ తీసుకున్న జాగ్రత్తలు చిరంజీవి పాత్రకు కొత్త అందాన్ని తెచ్చాయి. ఇక ఈ సినిమా ప్రధాన బలాల్లో భీమ్స్ సంగీతం ఒకటి. ప్రతి పాటా జనాలకు నచ్చింది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునేలా ఉంది. సమీర్‌రెడ్డి కెమెరా వర్క్ సూపర్. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా ఉంది. చిరంజీవి, వెంకటేశ్, నయనతారలను చాలా అందంగా చూపించారాయన. మొత్తంగా సాంకేతికంగా అన్ని విధాలుగా సినిమా సమర్థనీయంగానే ఉంది.
మొత్తంగా ఆద్యంతం తనదైన కామెడీతో గిలిగింతలు పెడుతూ.. అక్కడక్కడ ఎమోషన్స్‌తో మనసుల్ని గిల్లుతూ, అవసరమైన చోటా మెగాస్టార్ గ్రేస్‌ని నేటి తరానికి పరిచయం చేస్తూ, అభిమానులకు వింటేజ్ మెగాస్టార్‌ని గుర్తు చేస్తూ.. అద్భుతంగా సినిమాను మలిచాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇది అభిమానులకే కాదు, సగటు ప్రేక్షకులకు కూడా నచ్చే సినిమా. ఈ సంక్రాంతికి సరైన సినిమా అనొచ్చు..

Mana Shankara Varaprasad Ga
+ చిరంజీవి నటన,
+ సున్నితమైన హాస్యం,
+ ఎమోషన్స్‌తో సాగే కథ, కథనాలు,
+ వెంకటేశ్ సీన్స్..
– ఫస్ట్ హాఫ్‌లో ఒకట్రెండ్ కామెడీ సీన్లు,
– సెకండాఫ్‌లో కాస్త స్లో అవ్వడం..
3.25/5