ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. పల్లెల్లో సాగు సందడి మొదలైంది. వానకాలం వ్యవసాయ సాగులో రైతులు, కూలీలు బిజీ అయ్యారు. విత్తనాలు విత్తుకోవడం, కలుపు మొక్కలను తొలగించడం, పురుగు మందులు పిచికారీ చేయడం, ఎరువులు చల్లడం వంటి పనులతో పంట చేలలో సందడి కన్పిస్తోంది. గత నెల వరకు అనుకున్నట్లుగా వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. కానీ.. గడిచిన కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు కర్షకుల్లో ఆశలను చిగురింపజేశాయి.
-ఖమ్మం, జూలై 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం జిల్లాలో ఈ వానకాలం సీజన్లో దాదాపుగా ఐదు లక్షల పైచిలుకు ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న, కంది, పెసర, మినుములు తదితర పంటల సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే వ్యవసాయానికి అవసరమైన విత్తనాలను, ఎరువులను రైతులు కొనుగోలు చేసుకొని పంటల సాగుపై దృష్టి సారించారు. అయితే, సస్యరక్షణ చర్యలు, దిగుబడులు వంటి అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఇప్పటికే రైతులకు సూచనలు, సలహాలు అందిస్తున్నారు.
రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలని సూచిస్తున్నారు. తద్వారా అధిక దిగుబడులను పెంచుకోవాలని చెబుతూ అవగాహన కల్పిస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను మాత్రమే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.
ఈ ఏడాది రుతుపవనాలు ముందుగా వచ్చినా వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. మే నెల రెండో వారంలోనే రైతులు దుక్కులు సిద్ధం చేసుకున్నారు. కొందరు రైతులు తొలి దఫాగా పత్తి గింజలు కూడా విత్తారు. అయితే, ఆ కొద్దిరోజులకే వర్షాలు నిలిచిపోవడంతో ఆ పత్తి విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో రైతులు నష్టపోయారు. అయితే, ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో మరోమారు విత్తనాలను విత్తుతున్నారు.
5.56 లక్షల ఎకరాల్లో పంటలు..
ఖమ్మం జిల్లాలో సాధారణ వర్షపాతం 245.3 మిల్లీ మీటర్లు. కానీ.. గడిచిన రెండు రోజుల్లో వర్షం అధికంగా కురిసింది. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా రైతులు అత్యధిక ఎకరాల్లో పత్తి, వరి పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలో సారవంతమైన భూములు ఉండడంతో రైతులు వాణిజ్య పంటలకే మొగ్గుచూపుతున్నారు. ఖమ్మం జిల్లాలో 5.56 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయనే అంచనా ఉండగా.. ఇప్పటికే 2.76 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగును రైతులు మొదలుపెట్టారు. ఈ ఏడాది 2.21 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. 2.83 ఎకరాల్లో వరి, 12 వేల పైచిలుకు ఎకరాల్లో పెసలు, 1,500 ఎకరాల్లో మొక్కజొన్న, 41 ఎకరాల్లో చెరకు, 42 ఎకరాల్లో వేరుశనగ, 53 ఎకరాల్లో మినుములు, 131 ఎకరాల్లో కందులు సాగు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
పెరిగిన ‘సాగు’ ఖర్చు
వ్యవసాయానికి పెట్టుబడి ఖర్చులు ఏటికేడు భారీగా పెరుగుతున్నాయి. వ్యవసాయ పనులకు అవసరమైన కూలీల కొరత తీవ్రంగా ఉంది. దీనిని అధిగమించి యంత్రాలతో వ్యవసాయ పనులకు వెళ్తే డీజిల్ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ఇక ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, బ్లేడ్ ట్రాక్టర్లు, పురుగు మందుల పిచికారీ యంత్రాలు, వాటి నిర్వహణ వ్యవసాయ, అద్దె ఖర్చులు అమాంతంగా పెరిగాయి. అయితే, ఇంతలా వెచ్చించినప్పటికీ దిగుబడి మాత్రం అందుకు అనుగుణంగా రావడం లేదంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏజెన్సీలోనూ ముమ్మరంగా..
పర్ణశాల, జూలై 3: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ మండలమైన దుమ్ముగూడెంలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. చిన్న బండిరేవు, నల్లబెల్లి, సున్నంబట్టి, పైడిగూడెం, కొత్తూరు, పర్ణశాల, సీతానగరం తదితర గ్రామాల్లో నాట్లకు కూడా సమాయత్తమవుతున్నారు. దుమ్ముగూడెం మండలంలో రైతులు ఇప్పటికే సుమారు 16 వేల ఎకరాల్లో పత్తి సాగును ప్రారంభించారు. నాలుగు రోజులుగా వర్షం కురవడంతో వరి సాగు చేసే రైతులు నారుమళ్లు సిద్ధం చేస్తున్నారు. మండలంలో సుమారు 20 వేల ఎకరాల్లో రైతులు వరి పంటను పండిస్తారు.