న్యూఢిల్లీ, నవంబర్ 29: శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు సోమవారమే నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. రైతు సమస్యలపై చర్చించాలన్న విపక్షాల ఆందోళన నడుమ.. ఎలాంటి చర్చ లేకుండానే నిమిషాల వ్యవధిలో ఉభయ సభలూ ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన నిరసనోద్యమానికి తలొగ్గిన ప్రధాని మోదీ… ఈ నెల 19న ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం తెలిసిందే. ఒక వర్గం రైతులే ఆందోళన చేస్తున్నప్పటికీ సాగు చట్టాల ప్రాధాన్యతను వారికి తెలియజెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని బిల్లును ప్రవేశపెట్టే సందర్భంగా కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షాల నిరసన
కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కోసం చట్టం చేయాలని, ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికిపైగా కొనసాగుతున్న నిరసనోద్యమంలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. టీఆర్ఎస్, డీఎంకే, టీఎంసీ ఎంపీలు లోక్‌సభ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ, బీఎస్పీ, ఐయూఎంఎల్ ఎంపీలు తమ స్థానాల్లోనే నిలబడి నిరసన తెలిపారు. ఈ నిరసనల మధ్యే స్పీకర్ ఓం బిర్లా మూజువాణి ఓటుతో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు ఆమోదం పొందిందని ప్రకటించారు. అయితే రైతుల సమస్యలపై చర్చించాలన్న డిమాండ్‌తో ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించడంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. చర్చ లేకుండా బిల్లును ఆమోదించడాన్ని రాజ్యసభలోనూ ప్రతిపక్షాలు నిలదీశాయి.
12 మంది ఎంపీల సస్పెన్షన్
ప్రతిపక్షాలకు చెందిన 12 మంది రాజ్యసభ సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. గత సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించారంటూ వారిపై క్రమశిక్షణా చర్యల కింద వేటు పడింది. ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు.
విద్యుత్తు బిల్లు ప్రవేశపెడితే దేశవ్యాప్త ఆందోళన: ఏఐపీఈఎఫ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు (సవరణ) బిల్లు-2021ను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎప్పుడు ప్రవేశపెడితే ఆ రోజునే దేశవ్యాప్త ఆందోళనకు దిగుతామని అఖిల భారత విద్యుత్ ఇంజినీర్ల సమాఖ్య (ఎఐపీఈఎఫ్) హెచ్చరించింది. ఈ ఆందోళనల్లో విద్యుత్తు రంగానికి చెందిన 15 లక్షల మంది ఇంజినీర్లు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొంటారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. పేదలు, గ్రామీణ ప్రజల విద్యుత్తు హక్కును హరించేలా కేంద్రం విద్యుత్తు సవరణ బిల్లును తీసుకొస్తున్నదని ఎఐపీఈఎఫ్ చైర్మన్ శైలేంద్ర దూబే దుయ్యబట్టారు.