ఏటూరునాగారం, నవంబర్ 3 : ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయాన్ని సోమవారం ఆదివాసీలు ముట్టడించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ముందుగా వై జంక్షన్‌లోని కుమ్రంభీం విగ్రహానికి పూల మాలలు వేసి అక్కడి నుంచి భారీ ర్యాలీగా ఐటీడీఏ కార్యాలయం వద్దకు చేరుకొని జాతీయ రహదారిపై బైఠాయించి గంటన్నర పాటు ధర్నా చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వివిధ మండలాల నుంచి సుమారు 3 వేల మంది ఆదివాసీలు పాల్గొన్నారు. ముందస్తుగా ఐటీడీఏ ప్రధాన గేట్లను పోలీసులు మూసేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివాసీలు, మహిళలు గేట్లు తెరుచుకొని లోపలికి వచ్చేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
జేఏసీ చైర్మన్ పూనెం శ్రీనివాస్, వైస్ చైర్మన్ వట్టం ఉపేందర్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 342(1),(2)ప్రకారం షెడ్యూల్డ్ తెగల జాబితాను ప్రకటించడం, సవరణ చేయడం రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులు, అడ్వయిజరీ కమిటీ అభిప్రాయం, పార్లమెంటులో చర్చలు, రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆధారంగా జరగాల్సి ఉన్నప్పటికీ 1976లో అందుకు విరుద్ధంగా ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ, అసెంబ్లీ, పార్లమెంట్ తీర్మానం, నోటిఫికేషన్ లేకుండా లంబాడీలను 1976లో ఎస్టీ జాబితాలో చేర్చడంతో ఆదివాసీలకు అందాల్సిన రిజర్వేషన్లు వారు పొందుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న లంబాడీల రిజర్వేషన్లను నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఈనెల 24న ఉట్నూరు, డిసెంబర్ 15న మన్ననూరు, డిసెంబర్ 29న భద్రాచలం ఐటీడీఏల వద్ద ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం స్పందించకుంటే ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి, వంటావార్పు చేస్తామన్నారు. అనంతరం ఐటీడీఏ పీవో చిత్రామిశ్రాకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్లు, కో చైర్మన్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, సంఘాల నాయకులు పాయం ఊకె రవి, పాయం సత్యనారాయణ, కుర్స నర్సింహమూర్తి, పొదెం కృష్ణప్రసాద్, సోయం కామరాజు, పూనెం రామచంద్రు, ముర్రం వీరభద్రు, వాసం నాగరాజు, కల్తీ కుమారస్వామి, పొడెం బాబు, దబ్బగట్ల శ్రావణ్‌కుమార్, చింత సర్వేశ్, ఈసాల సురేశ్, మడి సాయిబాబా, చింత సమ్మయ్య, కుంజ రమాదేవి, కనితి రాధా, సోయం కన్నరాజు, కోరగట్ల లక్ష్మణ్‌రావు, సిద్దబోయిన రాంబాబు, బడే సులోచన, శమంతకమణి, ఈసం స్వరూప, సరిత, చేల బాబురావు, సిద్దబోయిన సురేందర్, పర్షిక సతీశ్ పాల్గొన్నారు.