తాంసి, ఫిబ్రవరి 16 : రాష్ట్రంలోని అన్ని హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తామని ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ డాక్టర్ నీరజ ప్రభాకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో రూ.90 లక్షలతో నిర్మించిన భవన సముదాయాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉద్యాన పంటల్లో నూతన పద్ధతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదన్నారు. రైతులు లాభాదాయకమైన పంటలు పండించేలా ఆవిష్కరణలు రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులకు ఎంతో ఉపయోగకరమైన ఫల, పూల మొక్కలను తయారు చేశామని తెలిపారు. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా.ఏ.భగవాన్, డీన్ డా.ఎం. పద్మ, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.ప్రీతంగౌడ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.