Addanki Dayakar | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): బ్రిటిష్ వలస పాలకులకే వెనుకడుగువేయని కాంగ్రెస్ నాయకులు మోదీ, అమిత్‌షాకు భయపడతారని భావించడం బీజేపీ నేతల ఆహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పేర్లను ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీట్లో పేర్కొనడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్ ఎదుట నిర్వహించిన ధర్నాలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రు లు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
అద్దంకి దయాకర్ మాట్లాడుతూ మోదీ, అమిత్‌షా కేడీలు, దొంగలు.. దేశం కోసం ప్రాణాలర్పించిన, సెంటు భూమిలేని, సొంత ఇల్లు కూడా లేని సోనియా కుటుంబంపై కక్షగట్టారని మండిపడ్డారు. స్వాతంత్య్ర సంగ్రామంలో మీ పాత్ర ఎక్కడ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. 2029లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి కుట్రలను తిప్పికొడతామని, ఆ తర్వాత మోదీ ఉండేది జైలులోనే అని విరుచుకుపడ్డారు. దొంగతనం చేసింది మీరు, కేడీలు మీరు అంటూ దుయ్యబట్టారు. ఆర్ఎస్ఎస్ ఇలాంటి దరిద్రపుగొట్టు నాయకులను దేశానికి ఇచ్చిం దా? అని ప్రశ్నించారు.
దేశం కోసం త్యాగాలు చేసిన పార్టీపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అంజన్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. కిషన్‌రెడ్డిని ఉద్దేశించి అంజన్‌కుమార్‌యాదవ్ రాయడానికి వీలులేని భాషలో దూషించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వంపై తీవ్రవిమర్శలు చేశారు. అహ్మదాబాద్‌లో ఏఐసీసీ సమావేశంలో కాంగ్రెస్ రూపొందించిన ఎజెండాకు భయపడి, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను చేర్చారని ఆరోపించారు. ధర్నాలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథ్, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.