మరిపెడ, నవంబర్ 6 : రైతు బీమా పథకం కోసం దరఖాస్తును ఆన్లైన్ చేయడానికి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏఈవో ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో చోటుచేసుకున్నది. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం.. మరిపెడ మండలం నీలికుర్తి క్లస్టర్‌లోని ఆనేపురం రెవెన్యూ పరిధి స్టేజీతండాకు చెందిన గుగులోత్ భీమా అనే రైతు గత నెల 14న మరణించాడు.
ఆయనకు సంబంధించిన రైతుబీమా పథకం కోసం కొడుకు గుగులోత్ వసంత్ గతనెల 30న ఏఈవో సందీప్‌ను కలిశాడు. తనకు రూ.20 వేలు లంచం ఇస్తేనే రైతుబీమా పథకం కోసం ఆన్లైన్ చేస్తానని చెప్పాడు. అంత డబ్బు ఇచ్చుకోలేనని వసంత్ వేడుకోగా రూ.10 వేలకు ఒప్పందం కుదిరింది. గురువారం మరిపెడ మండల కేంద్రంలోని జేజే రెస్టారెంట్ ఎదురుగా బాధితుడి నుంచి ఏఈవో రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో విచారణ చేపట్టారు.