అమీన్పూర్, నవంబర్ 6: కొందరు కొన్నికొన్ని కీటకాలను చూసి భయపడుతుంటారు. ఈ కోవలోనే చీమల ఫోబియాతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన సం గారెడ్డి జిల్లా అమీన్పూర్లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలకు చెం దిన చిందం శ్రీకాంత్, ద్యావనపల్లి మనీషా (25) దంపతులు. వీరికి మూడేండ్ల కూతురు ఉన్నది. ఉద్యోగరీత్యా వీరు అమీన్పూర్ పట్టణ పరిధిలోని నవ్య హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు.
మనీషాకు చిన్నప్పటి నుంచి చీమలంటే భయం ఉండేది. మంగళవారం సాయం త్రం చీమలకు భయపడి ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. పక్కనే ఒక పేపర్లో ‘శ్రీ.. ఐయామ్ సారీ, ఈ చీమలతో బతకడం నా వల్ల కాదు. కూతురు అన్వి జాగ్రత్త. అన్నవరం, తిరుపతి దేవుళ్లకు రూ.1,116 మొక్కు, ఎల్లమ్మకు ఒడిబియ్యం మర్చిపోకు’ అని సూసైడ్ నోట్ రాసి ఉన్నది. పోలీసులు పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.