హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. టూవీలర్లకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం(ఏబీఎస్) తప్పనిసరిగా ఉండాలని, ప్రయాణికులిద్దరూ హెల్మెట్ ధరించాలని స్పష్టంచేసింది. ప్రస్తుతం 150 సీసీ కంటే ఎక్కువ గల వాహనాలకు ఏబీఎస్ అమల్లో ఉంది. దీనిని ప్రారంభస్థాయి బైక్స్‌కు కూడా వర్తింపచేయాలని నిర్ణయించింది. ఈ రెండు నిబంధనలు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చేలా కేంద్ర రవాణాశాఖ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుందని అధికారులు చెప్తున్నారు.
దేశవ్యాప్తంగా 75 శాతం వాహనాలు ఎంట్రీవెవల్ మాడళ్లే ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 2022 లెక్కల ప్రకారం 20 శాతం రోడ్డుప్రమాదాలు బైకుల కారణంగానే జరుగుతున్నాయని చెప్తున్నారు. టూవీలర్లకు ఏబీఎస్, రెండు హెల్మెట్ల నిబంధనలు తీసుకొస్తే వాహనదారులను ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చని వివరిస్తున్నారు. సడన్ బ్రేక్ వేసినప్పుడు వాహనాలు అదుపుతప్పకుండా ఏబీఎస్ ఉపయోగపడుతుంది. ఈ సౌలభ్యం వాహనాలకు అమర్చడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి, వాహనధరలు రూ.2500 నుంచి రూ.5వేల వరకు పెరుగుతాయని మార్కెట్‌వర్గాలు చెప్తున్నాయి.