గద్వాల అర్బన్ : ‘సామాన్యులకు అండగా ఉంటాం.. ఫ్రెండ్లీగా ఉంటాం.. వారికి న్యాయం చేయడమే మా విద్యుక్త ధర్మం’ లాంటి మాటలు పోలీసుల నోటి వెంట తరచూ వింటూ ఉంటాం. కానీ స్టేషను మెట్లు ఎక్కాలంటే సామాన్యులకే కాదు, విద్యావంతులకు కూడా భయమే. అవతలి వైపు రాజకీయ పలుకుబడి, డబ్బు ఉంటే పోలీసు స్టేషన్లో న్యాయం సంగతి మర్చిపోవాల్సిందే అనే విమర్శలు ఉన్నాయి. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధిత కుటుంబ సభ్యుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండలం కుచినెర్ల గ్రామానికి చెందిన చిన్నతాయప్పకు చెందిన కొంత పొలాన్ని దాయాదులకు విక్రయించాడు. జూన్ 29న విక్రయించిన పొలం తక్కువ ఉందని దాయాదులు చిన్న తాయప్ప కుమారుడు నాగరాజును నిలదీశారు. ఈ క్రమంలో పెద్ద తాయప్ప, మల్లయ్య కుమారులైన అంజనప్ప, కొండప్ప దాడి చేయగా.. గాయపడిన బాధితుడు కేటిదొడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల సూచన మేరకు బాధితుడు గద్వాల దవాఖానలో మెడికల్ రిపోర్ట్ తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్లగా కేసు నమోదు చేయలేదు. దీంతో చేసేదేమి లేక నాగరాజు తిరిగి ఇంటికి వెళ్లాడు.
ఆవేదనకు గురైన నాగరాజు తల్లి సత్యమ్మ అదే రోజు సాయంత్రం దాడి చేసిన వారి ఇంటి వద్ద నిలదీసేందుకు వెళ్లగా నాగరాజు పై దాడి చేసిన వారు ఫోన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నాగరాజును ఫోన్లో గట్టిగా మందలించారని, దీంతో మనస్తాపానికి గురైన నాగరాజు పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తల్లి సత్యమ్మ తెలిపింది. గమనించిన కుటుంబ సభ్యులు నాగరాజును వైద్యం కోసం రాయచూరులోని హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం నాగరాజు రాయచూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై కేటిదొడ్డి ఎస్ఐ బి.శ్రీనివాసులును వివరణ కోరగా నాగరాజు ఫిర్యాదు మేరకు దాడి చేసిన ఆంజనేయులు, పెద్ద తాయప్ప, కొండప్పలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.