హనుమకొండ చౌరస్తా : విశ్వవిద్యాలయాల అభివృద్ధి పట్ల కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నాయని పీడీఎస్‌యూ ( PDSU ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు( Narasimha Rao ) ఆరోపించారు. ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాల అభివృద్ధికి ప్రత్యేక ఎజెండాను ( Separate agenda ) రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం కేయూ గెస్ట్‌హౌస్‌లో పీడీఎస్‌యూ కేయూ కార్యవర్గ సమావేశం బి. బాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓయూ ( OU )అభివృద్ధికి వెయ్యి కోట్ల నిధులు కేటాయించి ఇతర విశ్వవిద్యాలయాల అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ( Narendra Modi ) ప్రభుత్వం యూజీసీ అధికారులు వివిధ రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశ్వవిద్యాలయాల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోసం పీడీఎస్‌యూ రూపొందించిన యూనివర్సిటీ విద్యార్థుల ఎజెండా అమలు కోసం యూనివర్సిటీ విద్యార్థులంతా సంఘటిత ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు బి.అజయ్, కేయూ ప్రధాన కార్యదర్శి వి.కావ్య, ఉపాధ్యక్షులు పి.అనూష, లోకేష్, యాదగిరి, సహాయ కార్యదర్శులు గణేష్, పృధ్వీరాజ్, వంశీ, కోశాధికారి సంగీత, నాయకులు శ్రీకాంత్, నాగరాజు, అనిల్, వంశీ, నందు పాల్గొన్నారు.