అమరావతి : వివాహేతర బంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పోలీస్స్టేషన్ ముందే ఓ వ్యక్తి తన భార్యతో వివాహేతర బంధం పెట్టుకున్న వ్యక్తిని దారుణంగా హత్యచేశాడు. ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లా (Sri Satya Sai district) తనకల్లు పోలీస్స్టేషన్ (Thanakallu PS) ముందు ఈ హత్య జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీసత్యసాయి జిల్లా రాగినేపల్లికి చెందిన హరి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో మార్పురివాండ్లపల్లికి చెందిన ఈశ్వరప్ప అమెతో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. నాలుగు రోజుల క్రితం ఆమెను తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయాడు. దాంతో తన భార్య కనిపించడం లేదని హరి తనకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హరి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు ఈశ్వరప్పను పట్టుకుని తనకల్లు పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ బయట కాపుకాసిన హరి ఈశ్వరప్ప బయటకి రాగానే వేట కొడవలితో దారుణంగా హత్య చేశాడు. కాగా, ఈ హత్యకు తనకల్లు పోలీస్ స్టేషన్లోని ఓ హెడ్ కానిస్టేబుల్ సహకారం ఉందని ఈశ్వరప్ప కుటుంబం ఆరోపిస్తోంది.