ముంబై, మార్చి 12: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు భారీ ఊరట లభించింది. బ్యాంక్ డిజిటల్ వ్యాపారాలపై నియంత్రణ ఎత్తివేస్తు రిజర్వుబ్యాంక్ నిర్ణయం తీసుకున్నది. డిజిటల్ వ్యాపారంలో జరిగిన అవకతవకల కారణంగా గతంలో ఈ వ్యాపారాలపై నియంత్రణ విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గడిచిన రెండేండ్లుగా సాంకేతిక విభాగంలో తలెత్తిన సమస్యల కారణంగా గతేడాది చివర్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల జారీపై రిజర్వుబ్యాంక్ నియంత్రణ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ నియంత్రణ ఎత్తివేసిందని బ్యాంక్ బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంతో బ్యాంక్ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంలో భాగంగా ప్రకటించిన ‘డిజిటల్ 2.0’ పథకానికి ఊరట లభించినట్లు అయింది. గత రెండేండ్లుగా బ్యాంకునకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, చెల్లింపులకు సంబంధించిన పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.