జరిగిన కథ : వారసత్వ పోరులో మురారి దేవుడు మరణించాడని తెలిసి ఎక్కువగా బాధపడ్డవాడు దేవగిరి మహాదేవుడు! కాకతీయ సామ్రాజ్య నాశనాన్ని నరనరానా కోరుకునే ఆగర్భశత్రువు.. మహాదేవుడు!ఏది ఏమైనా రుద్రమను తుదముట్టించాలని.. కాకతీయ రాజధాని అనుమకొండపై దండెత్తి వస్తున్నాడు. మహాసైన్యంతో ఉప్పెనలా అనుమకొండ పొలిమేరకు చేరాడు.
ససైన్యంగా తరలివచ్చిన దేవగిరి మహాదేవుని ఊహలకు అందనంత దుర్భేద్యంగా సమున్నతంగా ఉంది ఓరుగల్లు. చూసి ఖంగుతిన్నాడు. అతని యుద్ధవీరులు నోరు తెరిచారు. తండ్రీకూతుళ్లు ఆంధ్రనగరి నిర్మించారంటే ఏమో అనుకున్నారు. కళ్లారా చూశాక కళ్లు తిరిగి నిలబడిపోయారు. కొందరు సేనానులు అడుగులో అడుగు వేసుకుంటూ ద్వారాలు మూసి ఉన్నకోట వరకు వచ్చి చూశారు. “మహాప్రభో! ఇది మట్టికోట..” అన్నాడొకడు. పకపకా నవ్వారు మిగిలిన వారు. ఇంకా దగ్గరకొచ్చి చూశారు మరికొందరు. అప్పుడు కనిపించింది అగడ్త. విశాలంగా కాకతీయులు నిర్మించిన నీటి సముద్రాల్లాగా. “మహా ప్రభో.. పెద్ద అగడ్త..” అన్నాడో వీరుడు. ‘ఆ..’ అంటూ తలతిప్పితే మొసలి నోట్లో ఉన్నాడు. అప్పటికే మిగిలిన వారిని మొసళ్లు నమిలేస్తున్న శబ్దం.. కరకర.. ఫటఫట.. అంతా అర్థమయ్యేసరికి చావుభయం నరనరానా పాకి.. పారిపోవడం ఎలాగోనని దిక్కులు చూస్తున్నారు.
“ఒరే.. ఆ ద్వారం తీసి ఉంది. మూయడం మరిచినట్లున్నారు.. పరిగెత్తించు సైన్యాన్ని..” ఆ ద్వారం కావాలనే తెరిచిపెట్టినట్లు తెలియని యాదవసైన్యం వేగాతివేగంగా లోపలికి వచ్చిపడింది. తీసివున్న కోటద్వారాల గుండా లోపలికి.. లోలోపలికి వెళ్లిపోయారు. కానీ ఆ ద్వారాలు మృత్యు గహ్వరాలని కొద్దిసేపటికే తెలిసింది. లోపల పూర్తి సిద్ధంగా ఉన్న కాకతీయ సైన్యం చుట్టుముట్టే వరకు తెలియదు తాము మృత్యువు నోట్లోకి వెళ్లిపోయామని.. ప్రతి కాకతీయ సైనికుడు పదిమంది శత్రు సైనికులను లిప్తల కాలంలో నరికివేశారు. పైనుండి సలసలా కాగుతూ పడుతున్న వేడినీటిలో కొందరు శరీరమంతా కాలి మాంసపు ముద్దలుగా మిగిలారు. మొసళ్లు ఆవురావురుమంటూ పండుగ చేసుకున్నాయి. పైనుండి దొర్లిపడుతున్న ఉక్కుగుండ్ల కింద ఎందరో నలిగిపోయారు. ఎందరికో కాళ్లు చేతులు వేరైపోయాయి. కాకతీయ ధనుర్ధానులు విజృంభించారు. వందలాదిమంది శత్రువులు విషపు బాణాల ధాటికి విగత జీవులయ్యారు. గుర్రాలు, ఏనుగులు చేసిన బీభత్సం అంతా ఇంతా కాదు. కాస్త తెప్పరిల్లి చూసేసరికి లోపలికి వచ్చిన దేవగిరి సైన్యం సగం పైగా మరణించింది. అప్పుడు అర్థమయ్యింది. లోనికి రానిచ్చి ఊచకోత కోశారని. సగం సైన్యం హరించుకుపోయాక బతికి బయటపడితే అదే పదివేలు అనుకున్న తరుణంలో ప్రాకారాల వెనగ్గా ఏదో ద్వారం తీసి కనిపించింది. మహారాజు, సర్వసైన్యాధ్యక్షుడు తదితరులు తమ గుర్రాలను ఆ వైపు పోనిచ్చి బయటపడ్డారు.
కానీ, అసలు మృత్యువు వారి కోసం అక్కడే వేచి ఉంది.. రుద్రమదేవి రూపంలో. కొదమ సింహంలా.. ఆకలిగొన్న బెబ్బులిలా మరో అతిపెద్ద కాకతీయ పటాలంతో కోట బయట సిద్ధంగా ఉంది రుద్రమదేవి. చావుతప్పి కన్నులొట్టపోయి బయటపడ్డ సైన్యం పారిపోవడం మొదలైతే.. వెంటపడి తరమడం కూడా మొదలయ్యింది. ముందు దేవగిరి సైన్యం.. వెనక రుద్రమ నేతృత్వంలో కాకతీయసైన్యం.. యోజనాలు.. గవ్యూతులు.. ఊర్లు.. అడవులు.. మైదానాలు.. దేశ దేశాలు చెప్పుకొనేలా.. రాజ్యాలు రాజులు వణికేలా.. తరుముతూ తరుముతూ.. పోయిపోయి.. దేవగిరి రాజ్యంలోని బీదరు కోటపై దాడి చేసి అక్కడ ఆగింది రుద్రమ. అప్పటికే ముందుజాగ్రత్త చర్యగా సింధ భైరవుడనే బీదరుకోట గుట్టుమట్లు తెలిసిన సేనానిని ససైనికంగా బీదరుకోట పొలిమేర వద్ద ఉంచింది. భైరవుడు రుద్రమతోపాటు బీదరు లోపలికి చొచ్చుకుపోయి కోటను ఘడియల సమయంలోనే రుద్రమ అధీనంలోకి తెచ్చాడు. అప్పటికి దేవగిరి మహాదేవుడికి నెత్తికెక్కిన కళ్లు దిగివచ్చాయి. రుద్రమను తక్కువగా ఎంచి కాకతీయకోటను గెలవాలని దండెత్తినవాడు పారిపోయి తిరిగి రావడం, రుద్రమ తరిమితరిమి చివరికి విలువైన బీదరుకోటనే ఆక్రమించడం శత్రువులందరికీ కాకతీయ మహారాణి రుద్రమదేవి చూపిన సందేశంలా తోచింది. బీదరు కోటను ఆక్రమించిన రుద్రమ మహదేవుణ్ని వదలలేదు. బీదరుకోటను స్కంధావారంగా చేసుకుని యుద్ధ సందేశం పంపింది సంధివిగ్రహి ద్వారా.
“యుద్ధానికి సిద్ధమా?”
కాళ్ల బేరానికి వచ్చాడు మహాదేవుడు. అయినా రుద్రమ వదలలేదు. ఓరుగల్లు నుండి వచ్చిన కాకతీయ సైన్య పటాలం దేవగిరిపై పడి దేవగిరికోటను సర్వనాశనం చేసింది. దొరికిన సైనికున్ని దొరికినట్లు నరికి చంపింది. ఊర్లకు ఊర్లు తగలబెట్టింది. రుద్రమ తన కసినంతా తీర్చుకుంది. ఆసేతుహిమాచలం రాజ్యాలన్నిటికీ గట్టి హెచ్చరిక పంపింది. ఆడది అని భావిస్తే ఫలితం ఇలా ఉంటుంది అని అందరికి అర్థమయ్యేలా చాటి చెప్పింది. ‘న స్ర్తీ సింహాసనమర్హతి’ అనే ధర్మనీతిని తిరగ రాసింది.. ‘స్త్రీ ఏవ సింహాసనమర్హతి’ అని. వేలకోట్ల నాణాలు, వజ్రవైడూర్యాలు, రత్న బంగారు రాశులు, వేలకొద్ది ఏనుగులు, అశ్వాలు.. ఒకటేమిటి ఆమె అడిగినవన్నీ ఇచ్చి సంధి చేసుకున్నాడు మహాదేవుడు. ఈ విజయ వార్తలన్నీ ఒక్కొక్కటిగా ఓరుగల్లు రాజనగరికి చేరుతున్నాయి. గణపతిదేవుని ఆనందానికి హద్దులు లేవు.
చాలు.. ఈ ఆనందం చాలు. ఇక అంతా నిశ్చింత.. కాకతీయ సామ్రాజ్యాన్ని రుద్రమదేవి ముందుకు నడిపించగలదు. ఆంధ్రనగరికి ఆమె కొత్తవన్నెలు దిద్ది సగర్వంగా ప్రపంచానికి చూపగలదు. తెలుగువారి అద్భుత భాషా, సాహితీ, నాట్య సంగీత సౌరభాలను మరింత పరిమళింపజేయగలదు. తెలుగువారి సహజ సంపదను పరిరక్షించగలదు. తెలుగువారి పౌరుషాగ్ని నిత్యనూతనంగా ప్రజ్వలింపజేయగలదు!! గణపతిదేవుడు సృష్టించిన కాకతీయ మహాసామ్రాజ్యం.. కృష్ణా గోదావరుల సంగమమై సాగుతున్నట్లు ఎప్పటిలా అద్భుతంగా, అమేయంగా కొనసాగుతోంది. కొనసాగిస్తోంది రాణిరుద్రమదేవి. ప్రశాంతంగా ఆనందంగా తుదికాలం గడుపుతున్నారు గణపతిదేవుడు, జాయసేనాపతి. సాహిత్యం, కవిత్వం, రాజనీతి గ్రంథపఠనం.. చర్చలు.. రాజ్య విశేషాలు.. చెవులకింపైన శుభవార్తలు..రానురా నూ ఆయన మగతలోకి జారిపోయాడు. కేవలం ఊపిరి పీల్చడం తెలుస్తోంది. అప్పుడప్పుడూ కాస్త కనుగుడ్లు కదులుతున్నాయి. సామ్రాజ్యంలోని సమస్త శైవాలయాలు, అన్ని శైవమఠాలు ఆయన కోసం శైవ నామజపం చేస్తున్నాయి.
చిదానంద రూపః శివోహం శివోహం॥
మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్ర జిహ్వా న చ ఘ్రాణనేత్రం
న చ వ్యోమ భూమిర్-న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహం శివోహం ॥ 1 ॥
అహం ప్రాణ సంఙ్ఞో న వైపంచ వాయుః
న వా సప్తధాతుర్-న వా పంచ కోశాః
నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ
చిదానంద రూపః శివోహం శివోహం ॥ 2 ॥
న మే ద్వేషరాగౌ న మే లోభమోహో
మదో నైవ మే నైవ మాత్సర్యభావః
న ధర్మో న చార్ధో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం ॥ 3 ॥
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యఙ్ఞః
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోహం శివోహం ॥ 4 ॥
అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్
న వా బంధనం నైవ ముక్తి న బంధః
చిదానంద రూపః శివోహం శివోహం ॥ 5 ॥
న మృత్యుర్-న శంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ
న బంధుర్-న మిత్రం గురుర్నవ శిష్యః
చిదానంద రూపః శివోహం శివోహం ॥ 6 ॥
శివోహం శివోహం.. శివోహం శివోహం.. శివోహం శివోహం.. శివోహం శివోహం.. శివోహం శివోహం.. శైవనామ పారాయణ వింటూ ఓ దివసావశాన ప్రశాంతంగా శివ సాయుజ్యం చెందాడు గణపతిదేవుడు. మహానేత, గొప్ప యుద్ధవీరుడు, తెలుగు జాతిని ఏకఛత్రం కింద పొదివినవాడు.. తెలుగు సామ్రాజ్యానికి హద్దులు నిర్దేశించినవాడు, ఆ హద్దులస్థాపన కోసం ఓటమి ఎరుగని పోరాటం సల్పిన మహాయోధ.. జీవితాన్ని ఆమూలాగ్రంగా చూసినవాడు, కష్టాలను, నష్టాలను ప్రజల బాధలను, ఆనందాలను వారిలో ఒకడై అనుభూతించినవాడు, వారి ఉన్నతి కోసం అహరహమూ తపించినవాడు ఆ రుద్రదేవునిలో ఐక్యమయ్యాడు. దాదాపు లక్ష దేవాలయాలు, లక్షల నీటిసముద్రాలు, వేల విద్యాలయాలు, ఘటికాస్థానాలు, అగ్రహారాలు.. వర్తక సామ్రాజ్యాలు.. ఎందరో పండితుల, కవుల, కళాకారుల, స్థపతుల, శిల్పుల అత్యద్భుత కళాసృష్టి.. అరవై మూడు వత్సరాల ఆయన అద్భుత పాలనా స్వర్ణయుగంలో తేలియాడుతున్న ఆంధ్రనగరి దుఃఖ సాగరమైంది. కాకతీయ సామ్రాజ్యం విషాదంలో మునిగిపోయింది. తెలుగువాడు ఎక్కడ ఉన్నా కంటతడి పెట్టాడు.
పదిరోజులపాటు సామ్రాజ్యం నలుమూలల నుండి ప్రజలు కన్నీటితో గణపతిదేవుని ఆఖరివీక్షణాల కోసం రాజధానికి పోటెత్తారు. అన్ని మూలల నుండి వస్తున్న అశ్వాలు, గజాలు, రథాలు, పల్లకీలు, ఎడ్లబళ్లు, గాడిదలు అన్నిటికీ దారి ఆంధ్రనగరి ఓరుగల్లే. ఓరుగల్లు అంతా ఇసుకవేస్తే రాలనంత జనం. ఆ మహాపురుషుని పార్థివ శరీరాన్ని ప్రజల దర్శనార్థం రాజనగరి ముందు ఎత్తయిన వేదికపై ఉంచారు. వేదిక చుట్టూ బంధువులు, మిత్రులు, ఆత్మీయులు, మహాప్రధానులు, మండలేశ్వరులు, సేనానులు. అంతిమ సంస్కారాల ఏర్పాట్లలో రాణిరుద్రమ, నిడదవోలు వీరభద్రుడు, వెలనాడు పృథ్వీశ్వరుడు, కుమార రుద్రదేవుడు తదితరులు.. ఆ వేదిక ముందు ఆస్థాన నర్తకి లలితాంబ బృందం నృత్త నీరాజనం!! ఒంటరిగా జాయసేనాపతి! రాజనగరిలో కాసేపు.. పురనివాసంలో కాసేపు.. లక్షలాది విషణ్నవదన పురజనులమధ్య ఒక్కడుగా జాయ సేనాపతి. దుఃఖం రావడంలేదు. కళ్లలో చెమ్మలేదు. గుండెలో తడి లేదు. అంతకుమించిన విషాదం! తను ఒంటరి.. పూర్తిగా.. ఇంటా బయటా.. ఎవ్వరూ లేరు. ఏమీలేదు.
వెళ్లి దూరంనుంచి చూస్తాడు గణపతిదేవుని పార్థివ శరీరాన్ని.. దగ్గరగా వచ్చి రెప్పవేయకుండా చూస్తాడు. ఆయన పార్థివ దేహాన్ని కాలి గోరునుండి తలవెంట్రుక వరకు.. మళ్లీ దూరంగా.. మళ్లీ దగ్గరగా. పదిరోజులు అలా.. చూస్తాడు చూస్తాడు చూస్తూనే ఉంటాడు.. ఆకలి దప్పులు లేవు.. తెలియవు! నిస్తేజమై.. ఎక్కడా నిలబడని చంచలములైన చూపులు.. చివరిరోజు పురజనుల వరుసలో.. చిన్ననాటి మిత్రులు కనిపిస్తున్నారు. సంగీత గురువు అశోకుడు, నాగంభట్టు కొడుకు రెండవ శివభట్టు, సుబుద్ధి కొడుకులు, మనుమలు, త్రిపుర, చలమయ, గాలి నరసయ, అన్న కంటకదొర భార్య, గణితశాస్త్రవేత్త కుమారిలభట్టు, రసాయన శాస్త్రవేత్త సత్యవ్రతుడు, వైద్యులు ప్రజాపతి, ప్రజ్ఞావతి దంపతులు, చిత్రకారుడు సీతాయ, వజ్రాలవ్యాపారి కామిసెట్టి, ఉభయదేశీ వస్త్రవర్తకుడు నకులశెట్టి, పశువుల వ్యాపారి రాముడు, తోలువస్తు వణిజుడు కాంతయ.. పోయినవారు పోగా ఉన్నవారంతా వృద్ధులయ్యారు.. ఒకరినొకరు గుర్తుపట్టారు. రోదిస్తూ చూస్తున్నారు. గణపతిదేవుని పార్థివ దేహం వద్ద జాయపుని చిన్ననాటి స్నేహితులు కనిపిస్తున్నారు. రాజనగరి మిత్రులు ముమ్మడి దంపతులు.. ఇంద్రాణి కాదు మరొకామే, వరుసలో దూరంగా ఇంద్రాణి భర్తతో..ఎక్కడెక్క డివాళ్లో కనిపిస్తున్నారు కానీ.. నా.. దూరంగా ఓ మహిళను చూసి నోట మాటరాక మ్రాన్పడిపోయి చూస్తున్నాడు. ఆమె?.. ఆమె! అనుమానం లేదు. ఆమె ఆమె!!