రంగారెడ్డి : జిల్లాలోని కొత్తూరు మండలం సిద్దాపూర్లో డంపింగ్ యార్డు ( Dumping yard ) ఏర్పాటుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ( Harish Rao ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు స్థానికులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. డంప్ యార్డు వల్ల ఏ విధంగా నష్టపోతున్నామో వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పక్షాన పోరాడాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. సిద్దా పూర్ ( Siddapur ) గ్రామంలో 86 ఎకరాల్లో డంప్ యార్డు ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నం. 641 తీసుకురావడం అత్యంత దుర్మార్గమైన చర్యని పేర్కొన్నారు. పచ్చని వ్యవ సాయ భూముల మధ్య, జనావాసాలకు సమీపంలో డంప్ యార్డు ఏర్పాటు చేయాలను కోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనమని విమర్శించారు.
సిద్దాపూర్తో పాటు చుట్టుపక్కల ఉన్న దాదాపు 20 గ్రామాలు ఈ డంప్ యార్డు వల్ల తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గ్రామాల ప్రజలంతా పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి హైదరాబాద్ నగరానికి అవసరమైన కూరగాయలను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారని వెల్లడించారు. డంప్ యార్డు ఏర్పాటు చేయాలనుకుంటున్న స్థలానికి ఆనుకుని ఉన్న గుట్ట చెరువు నీటితోనే ఈ ప్రాంత రైతులు వ్యవసాయం చేసుకుంటు న్నారని, ఇక్కడ డంప్ యార్డు పెడితే ఆ నీరు పూర్తిగా కలుషితమై, సాగు నీటితో పాటు తాగునీటికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని అన్నారు.
ఎంతో ప్రసిద్ధి చెందిన జహంగీర్ పీర్ దర్గా పరిసర ప్రాంత స్థానికులతో పాటు భక్తులకు కూడా శాపంగా మారడం ఖాయమని అన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇదే ప్రాంతంలో, డంప్ యార్డుకు కేటాయించిన సర్వే నంబర్లు 252, 278, 361లో ఉన్న 334 ఎకరాల్లో ఐటీ పార్క్ నిర్మించాలని ప్రణాళికలు రూపొందించామని అన్నారు.
ఇక్కడ ఐటీ పార్క్ వస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ సంకల్పించిందని వివరించారు. ప్రభుత్వం వెంటనే సిద్దాపూర్ డంప్ యార్డు నిర్ణయాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని, స్థానిక రైతులకు అండగా నిలబడి పోరాడుతుందని హెచ్చరించారు.