రుద్రంపూర్, మార్చి 26 : తెల్లవారుజామున 4:30 గంటలు. కాలనీ అంతా ఇంకా నిద్రలోనే ఉంటుంది. అయితే ఒక్కసారిగా వినిపించే బొగ్గు ముక్కలను సుత్తితో కొట్టే చప్పుళ్లు సింగరేణి కాలనీలకు ఉదయపు సంకేతంగా మారేవి. ఆ శబ్దం వినిపించగానే రోజు మొదలైందని అర్థం చేసుకునే రోజులు అవి. వంట కోసం, వేడి నీళ్ల కోసం, చలిని పారదోలడానికి కార్మికుల ఇళ్లలో విడదీయరాని భాగంగా నిలిచిన బొగ్గు బకీటు ఒక కాలంలో జీవన విధానంగా మారింది. కాలం మారి ఎల్పీజీ గ్యాస్ ఇళ్లలోకి వచ్చిన తర్వాత ఆ బొగ్గు బకీటు క్రమంగా జ్ఞాపకాలలోకి జారిపోయింది.
సింగరేణి ప్రాంతంలో ఒకప్పుడు బొగ్గు బకీటు తెలియని ఇల్లు చాలా అరుదు. సుమారు వందేళ్ల పాటు కార్మికులు, వారి కుటుంబాలతో బొగ్గు బకీటు అనుబంధం కొనసాగింది. సింగరేణి సంస్థ 136 ఏళ్ల ప్రస్థానంలో దాదాపు ఒక శతాబ్దం పాటు కార్మికుల ఇళ్లలో వంటకు, దైనందిన అవసరాలకు ఇదే ప్రధాన సాధనంగా నిలిచింది. వంట చేయాలన్నా, వేడి నీళ్లు కావాలన్నా, చలిని తరిమేయాలన్నా బొగ్గు బకీటే ఆధారం. ప్రతి రోజు రెండు పూటలు కార్మికుల ఇళ్లలో పొయ్యి మంటలు రగలడానికి ఇదే కారణం. కొన్నిసార్లు బొగ్గు బకీటు లేకపోతే ఆ ఇంట్లో వంట కూడా కష్టమయ్యే పరిస్థితులు ఉండేవి.
కాలక్రమంలో సింగరేణి గనులపై ఉన్న సొసైటీల ద్వారా గ్యాస్ పంపిణీ ప్రారంభమైంది. తొలుత ప్రైవేట్ గ్యాస్ కంపెనీలైన అంజలి, శక్తిగ్యాస్ ద్వారా సరఫరా జరగగా, తరువాత సింగరేణి సూపర్ బజార్ గోదావరి సొసైటీల ద్వారా భారత్, ఇండియన్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఇళ్లలోకి చేరాయి. దీంతో ఒకప్పుడు ప్రతి ఇంట్లో కనిపించిన బొగ్గు బకీటు క్రమంగా కనుమరుగు అవుతూ వచ్చింది. అయినప్పటికీ కొన్ని చోట్ల ఇప్పటికీ దాని సేవలను గుర్తుచేసుకుంటూ ఉపయోగిస్తున్నారు.
గతంలో మొదటి షిఫ్ట్‌కు వెళ్లే కార్మికుల ఇళ్లలో తెల్లవారుజామునే పనులు మొదలయ్యేవి. బొగ్గు ముక్కలను చిన్నగా చేయడానికి సుత్తితో కొట్టే శబ్దాలు కాలనీ అంతా వినిపించేవి. ఆ శబ్దం వినిపించగానే ప్రజలు మేల్కొనేవారు. ఒక రోజు పక్కింటి నుంచి ఆ శబ్దం వినిపించకపోతే, ఆ ఇంట్లో ఎవరో అనారోగ్యంతో ఉన్నారని భావించి పక్కింటివారు వెళ్లి బొగ్గు పొయ్యిని వెలిగించేవారు. కార్మికుల మధ్య ఉన్న ఆత్మీయత, పరస్పర సహకారం ఆ రోజుల్లో ఇలా ప్రతిబింబించేది.
పూర్వంలో వంట కోసం అడవులకు వెళ్లి కట్టెలు తెచ్చుకునే పరిస్థితి ఉండేది. వానాకాలంలో అయితే కట్టెలు తడిచి వంట చేసుకోవడం కష్టంగా ఉండేది. వంట చెరుకైన కట్టెల కోసం అడవులకు వెళ్లిన కొందరు ప్రమాదాల బారిన పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అప్పటి వారు కొందరు దొంగతనంగా బొగ్గు తెచ్చుకుని వంట చెరుకుగా వాడుకునేవారు. బొగ్గులు తెచ్చుకునే క్రమంలో సింగరేణి ఎస్ అండ్ పి సి సిబ్బందికి కార్మికులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనేది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్పటి కార్మిక సంఘం ఏఐటీయూసీ పోరాటం చేయడంతో సింగరేణి సంస్థ కార్మికులకు బొగ్గు సరఫరా ప్రారంభించింది. ప్రత్యేక కార్డుల ద్వారా ప్రతి నెల నాలుగు బస్తాల బొగ్గును అందించేవారు. అదే వారి వంటకు ప్రధాన ఆధారం అయ్యేది.
బొగ్గు బకీటు వెలిగించడం అంత సులువు కాదు. ముందుగా ఆయిల్‌తో తడిసిన “చిక్ వాయిస్” అనే గుడ్డను బకీటులో వేస్తారు. ఇది భూగర్భ గనుల్లో యంత్రాలకు అంటిన ఆయిల్‌ను శుభ్రం చేయడానికి ఉపయోగించే గుడ్డ. ఆ గుడ్డపై చిన్న కర్ర ముక్కలను పేర్చి, దానిపైన బొగ్గు ముక్కలను అమర్చుతారు. కర్రలు మెల్లగా మండుతుండగా ఆ వేడి బొగ్గుకు చేరి క్రమంగా మంటలు రగులుతాయి. పూర్తిగా మండిన తర్వాత దానిపైన వంట చేయడానికి సిద్ధమవుతుంది.
చలికాలంలో బొగ్గు బకీటు ఒక హీటర్లా ఉపయోగపడేది. చలిమంట బదులు దీన్ని వెలిగించి దాని దగ్గర కూర్చొని చలిని పారదోలేవారు. అయితే కొన్ని సందర్భాల్లో పూర్తిగా మండకముందే ఇంటి లోపలికి తీసుకువెళ్లడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ కారణంగా ఊపిరాడక ఇబ్బందులు పడిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
అప్పటి కార్మికులు ఇప్పటికీ గుర్తు చేసుకునే ఒక మధుర జ్ఞాపకం ఉంది. ఇంట్లో పప్పు చారు చేసినప్పుడు దానితో తినడానికి బొమ్మిడీలను తీసుకొచ్చి బొగ్గు పొయ్యిలో కాల్చుకుని తినేవారు. ఆ రుచి, ఆ పొగ వాసన, ఆ ఇంటి చుట్టూ కూర్చుని తిన్న క్షణాలు ఇప్పటికీ వారి జ్ఞాపకాలలో తాజాగా ఉంటాయి.
ఈ రోజు గ్యాస్ స్టౌలు, ఎలక్ట్రిక్ పరికరాలు జీవన విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. కానీ ఒకప్పుడు సింగరేణి కాలనీల్లో ఉదయాన్నే మేల్కొలిపిన బొగ్గు బకీటు చప్పుళ్లు, ఆ పొగ వాసన, ఆ అనుబంధాలు మాత్రం ఇప్పటికీ పెద్దల జ్ఞాపకాలలో జీవిస్తూనే ఉన్నాయి.
ఒకప్పుడు ప్రతి ఇంట్లో మంటలు రగిలించిన ఆ బొగ్గు బకీటు ఇప్పుడు అరుదుగా కనిపిస్తున్నా సింగరేణి కార్మికుల జీవితాల్లో అది ఒక యుగం. ఒక అనుబంధం. ఒక జ్ఞాపకం. ఇప్పుడది అరుదుగా కనిపించినా, ఒక కాలాన్ని గుర్తు చేసే జ్ఞాపకంగా బొగ్గు బకీటు ఇంకా జీవిస్తుంది.

సింగరేణి కార్మికుల జీవన మధుర జ్ఞాపకం.. బొగ్గు బకీటు