Heavy Rains | ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని అడవిలో చిక్కుకున్న 84 మంది పర్యాటకులను పోలీసులు రక్షించారు. గ్రామ సమీపంలోని ముత్యంధార జలపాతం చూసేందుకు 84 మంది పర్యాటకులు బుధవారం అటవీ ప్రాంతానికి వచ్చారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి 12 కార్లు, 10ద్విచక్ర వాహనాలపై నుంచి పర్యాటకులు బొగత జలపాతాన్ని చూసేందుకు వచ్చారు. అయితే భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగడంతో వారంతా అడవిలోనే చిక్కుకుపోయారు.
పర్యాటకులు అడవిలో చిక్కుకుపోయారన్న సమాచారం అందుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ, మంత్రులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ ఆదేశాల మేరకు ఎస్పీ గౌస్ ఆలం.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. పోలీసులు, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో గురువారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో పర్యాటకులను అడవిలో నుంచి బయటకు తీసుకొచ్చారు. పర్యాటకులు అందరూ క్షేమంగా బయటపడ్డారని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.