హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని కాంగ్రెస్ సర్కారు అప్పుల కుప్పగా మార్చేస్తున్నది. సగటున రోజుకు రూ.252.10 కోట్లు అప్పులు తెస్తున్నది. అలా ఏడాదిలో సమీకరించాల్సిన రుణాలను కేవలం 7 నెలల్లోనే తీసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో బహిరంగ మార్కెట్ నుంచి మొత్తం రూ.54,009 కోట్ల రుణాలు తెస్తామని రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిన రేవంత్‌రెడ్డి సర్కారు.. ఇప్పటికే ఆ లక్ష్యాన్ని దాటేసింది. ఈ నెల 18 నాటికే రూ.55 వేల కోట్లు సమీకరించింది. ఇది చాలదన్నట్టు ఈ నెల 25న మరో రూ.5 వేల కోట్ల రుణాలు తీసుకుంటామని రిజర్వు బ్యాంక్‌కు ప్రాతిపాదనలు పంపించింది.
మంగళవారం నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొని 13 ఏండ్ల కాలపరిమితితో రూ.500 కోట్లు, 17 ఏండ్ల కాలపరిమితితో రూ.2 వేల కోట్లు, 23 ఏండ్ల కాలపరిమితితో రూ.1,500 కోట్లు, 26 ఏండ్ల కాలపరిమితితో రూ.1,000 కోట్లు తీసుకుంటామని తెలంగాణ ఆర్థికశాఖ ఇండెంట్ పెట్టినట్టు శుక్రవారం ఆర్బీఐ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.2,29,720.62 కోట్ల రెవెన్యూ రాబడి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా.. అక్టోబర్ నాటికి రూ.94,555.97 కోట్లు మాత్రమే (41.16 శాతమే) వచ్చింది. దీంతో ఆదాయం, వ్యయం మధ్య అంతరాన్ని పూడ్చుకునేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు పూర్తిగా అప్పులపైనే ఆధార పడుతున్నది.
ఈ నెల 25న నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొంటామని ఆర్బీఐకి 14 రాష్ర్టాలు ప్రతిపాదనలు పంపాయి. ఈ రాష్ర్టాలన్నీ కలిపి మొత్తం రూ.26,550 కోట్ల రుణాలు సమీకరిస్తామని ప్రతిపాదించాయని, వీటిలో తెలంగాణ రూ.5 వేల కోట్లతో తెలంగాణ రాష్ట్రం టాప్‌లో ఉన్నదని ఆర్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ అజిత్ ప్రసాద్ (కమ్యూనికేషన్స్) వెల్లడించారు.
ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి రూ.54,009 కోట్ల రుణాలు మాత్రమే తీసుకునేందుకు వీలున్నది. కానీ, తొలి రెండు త్రైమాసికాల్లోనే (ఏప్రిల్-సెప్టెంబర్) రూ.48 వేల కోట్ల అప్పలు తెచ్చిన రేవంత్‌రెడ్డి సర్కారు..మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో మరో రూ.9,600 కోట్ల రుణాలు తీసుకుంటామని ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపింది. కానీ, ఈ నెలలోనే రూ.10 వేల కోట్ల రుణాలు సమీకరించనున్నది. అంటే ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి అప్పులు తీసుకోనున్నది. దీనికి అదనంగా చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో మరిన్ని రుణాలు సమీకరించే అవకాశం ఉన్నది.
గతంలో బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నడూ బడ్జెట్ ప్రతిపాదనలకు మించి రుణాలు తెచ్చిన దాఖలాలే లేవు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టకుండా, ఎన్నికల సమయంలో చెప్పిన గ్యారెంటీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలపై మోయలేని రుణభారాన్ని మోపడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
