హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర దేవాదాయ శాఖలో అధికారుల బదిలీలపై రచ్చ జరుగుతున్నది. ఏడీసీలు, డీసీల బదిలీలు ఇంకా మొదలవకముందే ఈ ప్రక్రియలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే సిద్ధమైన బదిలీల జాబితాలో దేవాదాయ శాఖ మంత్రి పేషీ అధికారులు, మరో ఇద్దరు మంత్రులు జోక్యం చేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దేవాదాయ శాఖలో కమిషనర్ తర్వాత ఆ స్థాయిలో ప్రధాన విభాగాలను పర్యవేక్షించే ముగ్గురు ఏడీసీల్లో ఒకరు ఇప్పటివరకు ట్రిబ్యునల్‌లో పనిచేయలేదని, తాను అక్కడికి వెళ్లలేనని చెప్పడంతో ఉన్నతాధికారులు వెనక్కు తగ్గి ఆమెను యథాస్థానంలోనే కూర్చోబెడుతున్నట్టు తెలిసింది. దీనిపై దేవాదాయ ఉద్యోగులు మండిపడుతున్నారు.
రెండు రోజుల క్రితం కమిషనర్ హరీశ్ పదోన్నతులకు సంబంధించిన ఫైల్స్ చూస్తున్నప్పుడు ఆమె జోక్యం చేసుకుని కొందరికి ప్రమోషన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని, దీంతో ఆ ఏడీసీ ఉంటే తాను కమిషనర్‌గా రానని గతంలో కమిషనర్‌గా పనిచేసిన కమిషనర్ ఓ అధికారి స్పష్టం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలోని రెండు ప్రధాన దేవాలయాలకు సంబంధించిన డిప్యుటేషన్ల విషయంలో ఆమె పరస్పర భిన్నంగా వ్యవహరించారని, ఒక దగ్గర డిప్యుటేషన్లపై నిషేధం ఉన్నదని చెప్పిన ఆ ఏడీసీ.. మరో దగ్గర డిప్యుటేషన్లు ఇచ్చారని, ప్రధాన కార్యాలయంలోని అన్ని సెక్షన్లలో తనకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డీసీఎస్‌గా పనిచేస్తున్న ఓ అధికారిని కొండగట్టుకు పంపి, అక్కడ ఉన్న డీసీని హైదరాబాద్‌కు బదిలీ చేయనున్నారని, హైదరాబాద్ డీసీని సర్వీసెస్ డీసీగా బదిలీ చేయనున్నారని, మరో డీసీని హైదరాబాద్‌లోనే ఉంచి ఆయనకు వేరే బాధ్యతలు అప్పగించనున్నారని తెలిసింది. కొండగట్టులో ఉన్న డీసీకి స్థానిక ఎమ్మెల్యేతో పొసగకపోవడంతో ఆయనను ఎట్టిపరిస్థితుల్లో అక్కడ కొనసాగించవద్దని సదరు ఎమ్మెల్యే పట్టుబడి పంతం నెరవేర్చుకున్నట్టు సమాచారం. కరీంనగర్‌లోని మరో పెద్ద దేవాలయ ఈవోపై ఎన్నో ఆరోపణలు ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే అండదండలతో ఆ అధికారి అక్కడే తన హవా కొనసాగిస్తున్నారు.
కొత్తగా సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లు?
దేవాదాయ శాఖలో సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లంటూ కొన్ని పోస్టులను సృష్టించి స్థానిక ఎమ్మెల్యేల సిఫారసు మేరకు నియామకాలు చేపట్టాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతున్నది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రతిపాదన మేరకు దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలతోపాటు ఆలయాల విశిష్టతను ప్రచారం చేసేందుకు దాదాపు 400 పోస్టులను క్రియేట్ చేయాలని చూస్తున్నట్టు వినికిడి. కానీ, అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని దేవాదాయ శాఖ ఏడీసీ కృష్ణవేణి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ల పేరిట దేవాలయాల్లో కొత్త ఉద్యోగులను నింపితే ఇప్పుడున్న వివాదాలకుతోడు కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.
9మంది నాన్ క్యాడర్ ఎస్పీల బదిలీ
తెలంగాణలో తొమ్మిదిమంది నాన్ క్యాడర్ పోలీస్ సూపరింటెండెంట్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. సైబరాబాద్ ఎస్బీ డీజీపీగా వైవీఎస్ సుధీంద్ర, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా సాయిశ్రీ నియామకమయ్యారు. హైదరాబాద్ సైబర్‌క్రైం డీసీపీగా అరవింద్‌బాబు, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా ధార కవిత, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా ఎం రవీందర్‌రెడ్డి, సీఐడీ ఎస్పీగా అశోక్‌కుమార్ నియమితులయ్యారు.