మహబూబ్‌నగర్, నవంబర్ 22: సరైన వైద్యం అందక ఓ బాలుడి ప్రాణం పోయింది. 16 గంటల పాటు మూడు పెద్ద దవాఖానలు తిరిగినా ఆ తల్లిదండ్రులకు పుత్రశోకమే మిగిలింది. సీఎం సొంత జిల్లాలోనే జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల దుస్థితికి అద్దం పడుతున్నది. వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన చెగువేరా (11) మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోచమ్మగడ్డ తండా సమీపంలోని బాలానగర్ గురుకులంలో 7వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 12న బాలుడు ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో బాలుడు అనారోగ్యానికి గురికాగా.. వనపర్తి జనరల్ దవాఖానకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. వైద్యులు జ్వరం వచ్చిందని వైద్యం చేశారు. అయినా తగ్గకపోవడంతో ప్రైవేట్ దవాఖానలో ఎక్స్‌రే చేస్తే న్యుమోనియా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
శుక్రవారం వనపర్తి ప్రభుత్వ దవాఖాన నుంచి మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నదని తెలిపారు. సరైన వసతులు లేవని, హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు తరలించాలని సూచించారు. దీంతో అంబులెన్స్‌లో నిలోఫర్‌కు తీసుకెళ్లగా, పరీక్షించిన వైద్యులు ఇంత ఆలస్యంగా ఎందుకు తీసుకొచ్చారని తల్లిదండ్రులను ప్రశ్నించారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున బాలుడు మృతి చెందాడు. పాలమూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ జనరల్ దవాఖానలో అన్ని వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని తమ బిడ్డను తీసుకొస్తే సరైన వైద్యం అందలేదని వాపోయారు. కొడుకుకు వైద్యసేవల కోసం 16 గంటలపాటు మూడు పెద్ద దవాఖానల చుట్టూ తిరిగినా చివరకు పుత్రశోకం తప్పలేదని రోదించారు. సర్కారు దవాఖానల్లో సరైన వైద్య సేవలు అందకే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని మండిపడ్డారు.