హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట శనివారం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు ల లొంగుబాటు వివరాలను హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శివధర్‌రెడ్డి వెల్లడించారు. లొంగిపోయిన వారిలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, అప్పాసి నారాయణ అలియాస్ రమేశ్, ముచ్చికి సోమడా అలియాస్ ఎర్ర ఉన్నారని తెలిపారు. వీరిలో ఆజాద్, అప్పాసి నారాయణ తెలంగాణకు చెందినవారు కాగా, మిగతా 35 మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని వివరించారు. ఆజాద్ 31 ఏం డ్లుగా, అప్పాసి నారాయణ 32ఏండ్లుగా అజ్ఞాతంలో ఉన్నట్టు తెలిపారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు, తొమ్మిది మంది ప్రాం తీయ కమిటీ సభ్యులు, 22 మంది దళసభ్యులు ఉన్నారని చెప్పారు. వీరి నుంచి ఒక ఏకే-47, రెండు ఎస్ఎల్ఆర్లు, నాలుగు 303 తుపాకులు, ఒక జీ3 తుపాకీ, 346 తూటాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
రివార్డులు అందజేసిన డీజీపీ
లొంగిపోయిన కొయ్యడ సాంబయ్య, అప్పాసి నారాయణ, ముచ్చకి సోమడాకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున రివార్డును డీజీపీ ప్రకటించారు. మిగతా 34 మందిలో డివిజనల్ కమిటీ సభ్యులకు రూ.5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులకు రూ.4 లక్షలు, పార్టీ సభ్యులకు రూ.లక్ష రివార్డును ప్రకటించారు. తక్షణ సాయం కింద 37 మందికి ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున డీజీపీ అందజేశారు. లొంగిపోయిన మావోస్టులందరిపై మొత్తం రూ.1.41 కోట్ల రివార్డు ఉన్నట్టు వెల్లడించారు. ఆ మొత్తాన్ని వారికే త్వరలో అందజేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పునరావాస ప్యాకేజీ అందిస్తామని తెలిపారు. మిగతా మావోయిస్టులు సైతం తొందరగా లొంగిపోవాలని డీజీపీ పిలుపునిచ్చారు. రాష్ర్టానికి చెందిన ఇంకా 59 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని చెప్పారు.
వీరిలో కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, పాక హనుమంతు అలియాస్ గణేశ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్టు వెల్లడించారు. రాష్ట్ర కమిటీలో 10 మంది, డివిజనల్ కమిటీలో 16, ఏరియా కమిటీ సభ్యులు 16, పార్టీ సభ్యులుగా 12 మంది ఉన్నారని తెలిపారు. వీరంతా ఛత్తీస్‌గఢ్ సహా ఇతర రాష్ర్టాల్లో పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. మావోయిస్టుల్లో పార్టీపరంగా విభేదాలు, అనారోగ్యం తదితర కారణాలతో బయటికి వస్తున్నారని డీజీపీ అభిప్రాయపడ్డారు. మావోయిస్టులు మీడియా, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకుల ద్వారా లొంగిపోయినా స్వాగతిస్తామని అన్నారు. వీలైనంత త్వరగా మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.