ముంబై: ఒక ఈటరీ షాపులో ఫుడ్ తిన్న సుమారు 59 మంది వ్యక్తులు అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, విరోచనాలతో ఆసుపత్రిలో చేరారు. ఆ షాపులో తిన్న ఆహారం విషతుల్యం కావడంతో వారంతా అస్వస్థత చెందినట్లు వైద్యాధికారి తెలిపారు. (59 People Hospitalised) మహారాష్ట్రలోని భివాండిలో ఈ సంఘటన జరిగింది. ఒక ఫుడ్ స్టాల్లో పిజ్జా వంటివి తిన్న కొందరు వ్యక్తులు అనారోగ్యం పాలయ్యారు. కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. తొలుత గురువారం 11 మందిని ఇందిరా గాంధీ మెమోరియల్ ఆసుపత్రిలో చేర్పించారు. అదే షాపులో ఆహారం తిన్న మరి కొందరు కూడా శుక్రవారం అస్వస్థత చెందారు. వారిని కూడా అదే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో మొత్తం 59 మంది అక్కడ చికిత్స పొందుతున్నారు.
కాగా, ఆ ఫుడ్ స్టాల్‌లోని ఆహారం విషమయం కావడంతో అక్కడ తిన్న సుమారు 59 మంది ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు వైద్యాధికారి తెలిపారు. వారంతా ఒకే షాపులో ఆహారం తిని అస్వస్థత చెందినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆహార భద్రత, సంబంధిత అధికారులు ఆ ఫుడ్ స్టాల్ నుంచి నమూనాలు సేకరించి పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.