హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ‘గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో బీబీనగర్ ఎయిమ్స్‌ను నిర్మిస్తున్నాం. అధునాతన వైద్య పరికరాలు, వసతి సదుపాయాలతో ప్రపంచస్థాయి వైద్య సేవలు ఎయిమ్స్‌లో అందుబాటులోకి తీసుకొస్తాం. ఏడాది చివరికల్లా ఎయిమ్స్‌లో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందిస్తాం..’ అంటూ ఈ నెల 3న బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించిన సందర్భంగా కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలకు పార్లమెంట్ సాక్షిగా ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించిన గణాంకాలకు పొంతన లేదని తేలిపోయింది. బీబీనగర్ ఎయిమ్స్‌లో మొత్తం 1,557 మంజూరైన పోస్టులకుగాను 527 ఖాళీలు ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇందులో మంజూరైన బోధనా సిబ్బంది పోస్టులు 183 కాగా, 132 పోస్టులను భర్తీ చేశారు. 1374 నాన్ ఫ్యాకల్టీ పొజిషన్స్ మంజూరు కాగా, 898 మంది సిబ్బందిని నియమించారు. 51 ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీలో 476 పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్వయంగా కేంద్రమే పార్లమెంట్లో వెల్లడించింది. రాష్ట్రంలో ఎయిమ్స్ తమ ఘనతే అంటూ బీజేపీ నేతలు తరచూ ఊదరగొడుతుంటే అందులోని ఖాళీలు ఆ పార్టీ పనితనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
దేశవ్యాప్తంగా 20 ఎయిమ్స్‌ల్లో 19,561 ఖాళీలు ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇందులో 2,356 బోధనా సిబ్బంది ఖాళీలు కాగా, 17,205 నాన్ ఫ్యాకల్టీ పోస్టులు ఉన్నాయి. ఢిల్లీ ఎయిమ్స్‌లో గత మూడేండ్లుగా బోధనా సిబ్బంది వరుసగా రాజీనామా చేశారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. 2023లో 19 మంది, 2024లో 14 మంది 2025లో 12 మంది రాజీనామా చేసినట్టు వివరించారు. బీబీనగర్ ఎయిమ్స్‌ను గత మూడేండ్లలో 19 మంది వీడినట్టు వెల్లడించింది. కేంద్రం ఈ విషయంలో చొరవ చూపాలని వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్న ఎయిమ్స్‌లో సైతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. న్యూఢిల్లీలో బోధన, బోధనేతర సిబ్బంది కలిపి మొత్తం మంజూరైన 15,217 పోస్టులకుగాను 2,988 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ ఎయిమ్స్‌లోనూ ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. రాజ్‌కోట్‌లో ఉన్న ఎయిమ్స్‌లో 850 ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొనసాగుతుండగా.. మొత్తం మంజూరైన పోస్టులు 2,262 కాగా, 800 ఖాళీలు ఉన్నాయి. యోగి ఆదిథ్యనాథ్ సీఎంగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు ఎయిమ్స్‌లు ఉన్నాయి. గోరఖ్‌పూర్ ఎయిమ్స్‌లో 639, రాయ్‌బరేలీలలో 591 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎయిమ్స్‌లో 1025 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాజస్థాన్ (జోధ్‌పూర్)లో910 ఖాళీలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ (రాయ్‌పూర్)లో1,174 పోస్టులు, ఒడిశాలో 1,125 ఖాళీలు ఉన్నాయి. ఉత్తరాఖండ్ (రిషికేష్)లో 1,270 ఖాళీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఎయిమ్స్ దవాఖానల్లో ఖాళీలు బీజేపీ ప్రభుత్వ పనితీరుకు అద్ధం పడుతున్నాయి. ఎయిమ్స్‌లో ఖాళీలను భర్తీ చేస్తే విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందడంతోపాటు పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా కేంద్రం హెల్త్ సెక్టార్ ప్రాముఖ్యతను గుర్తించి వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని వైద్యరంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.