జడ్చర్ల : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఈర్లపల్లి తండాలో ఇద్దరు వ్యక్తుల నుంచి 50 కిలోల నకిలీ పత్తి విత్తనాలను (Fake cotton seeds ) వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. శనివారం విత్తన టాస్క్ ఫోర్స్ ( Task Force ) టీం తనిఖీ నిర్వహించగా మెగావత్ రవి అనే రైతు వద్ద 15 కేజీలు , మెగావత్ చంద్య వద్ద 35 కేజీల ప్యాక్ చేయని నిషేధిత పత్తి విత్తనాల నిల్వలను టాస్క్ ఫోర్స్ టీం గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
నకిలీ పత్తి విత్తనాలు, లూజ్ విత్తనాలను ఎవరైనా అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్ తెలిపారు. రైతులు నకిలీ పత్తి విత్తనాలు తీసుకొని నష్టపోరాదని, ఎవరైనా నకిలీ లూజ్ విత్తనాలను విక్రయిస్తే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ తనిఖీలో జడ్చర్ల సహాయ వ్యవసాయ సంచాలకులు కృష్ణ కిషోర్ , మండల వ్యవసాయ అధికారి సిద్ధార్ధ , గోపీనాథ్ , జడ్చర్ల సీఐ కమలాకర్, ఎస్సై జయప్రసాద్ పాల్గొన్నారు .