తెలంగాణ ఏర్పడితే అభివృద్ధి జరుగదు, అశాంతి ప్రబలుతుందన్న విష ప్రచారాలను కేసీఆర్ తన సమర్థ పాలనతో తిప్పికొట్టారు. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ఇచ్చిన హామీలతోపాటు ఇతర అనేక పథకాలను అమలు చేసి ప్రజల సంక్షేమాభివృద్ధికి కృషిచేశారు. బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో అమలుచేస్తున్న పథకాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. బీఆర్ఎస్ పాలనలో విద్య, వైద్య సౌకర్యాలు పెరిగాయి. వ్యవసాయం, పారిశ్రామిక రంగంలో ఉపాధి, ఉత్పాదకత పెరిగింది. రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచి దేశానికి ఆదర్శమైంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు రావు, నిధులుండవు, కరెంటు ఉండదు, తాగు నీటికి కటకట, పరిపాలన చేత కాదు, పెట్టుబడులు రావు, హైదరాబాద్‌లో ఉన్న పెట్టుబడిదారులు ఇతర రాష్ర్టాలకు వెళ్ళిపోతారు, ఇతర ప్రాంతాల వారికి రక్షణ ఉండదు. రియల్ ఎస్టేట్ పతనమవుతుంది, హైదరాబాద్ వెలవెలబోతుంది, తెలంగాణలో అశాంతి ప్రబలుతుంది, తెలంగాణను మళ్లీ ఆంధ్రాతో కలపాలనే ప్రజా తిరుగుబాటు వస్తుందనే విష ప్రచారాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి విస్తృతంగా వ్యాప్తిలో ఉన్నాయి. వీటిని నమ్మినవారూ ఉన్నారు. ఉద్యమం నడిపించినంత చాకచక్యంగా కేసీఆర్ పాలన సాగిస్తారా లేదా అనే సంశయాలు వ్యక్తం చేసినవారూ లేకపోలేదు. కానీ కేసీఆర్ తన సమర్థ పాలనతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి ఐదేండ్లలోనే అన్ని అపవాదులు, అపనమ్మకాలు, సంశయాలను పటాపంచలు చేశారు. ఆయన సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనా ఫలాలు ప్రజలందరికీ అందుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభు త్వం సాధించిన ఫలితాలు, రాష్ట్ర ప్రగతి వాస్తవాలు ప్రజల ముందున్నాయి.
1956 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రజలకు కరెంటు, సాగునీరు, తాగునీరు, రవాణా, విద్య, వైద్యం తగినంత అందుబాటులో లేకపోవడం, తీవ్రమైన నిర్బంధం తెలంగాణ ప్రజా జీవితం నుంచి మొదటి ఐదేండ్లలోనే తరిమి వేయబడ్డాయి. 2014లో మొదటి ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ జటిలమైన విద్యుత్తు అంశాన్ని ప్రస్తావిస్తూ రెండేండ్ల దాకా ఈ సమస్య కొనసాగుతుందని ప్రజలను మానసికంగా సమాయత్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డాక చెప్పిన సమయం కంటే ఎంతో ముందే విద్యుత్తు సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. నాటి నుంచి రాష్ట్రంలో 24 గంటల నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.
2014లో అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే కేసీఆర్ ప్రజలకు ఆశ్చర్యకరమైన, అద్భుతమైన హామీ ఇచ్చారు. మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికీ నల్లా ద్వారా శుద్ధి చేసిన మంచి నీరందిస్తామని, ఇవ్వని పక్షంలో ఎన్నికల్లో ఓట్లు అడగబోమని ప్రతిజ్ఞ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇంటింటికీ తాగు నీరందించాకే ఓట్లడిగిన ఘనత, ప్రతిభ కేసీఆర్‌ది. గత పాలకులకు పాలన అంటే ఓట్లు. ఓట్ల కోసం, అధికారం కోసం తగాదాలు, గ్రూపులు తప్ప ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆలోచన వారికి లేదన్నది చేదు నిజం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సభలు, సమావేశాలు పెట్టి తాయిలాలు ప్రకటించేవారు. ఎన్నికల మ్యానిఫెస్టోల్లో చెప్పిన కొన్ని పథకాలను అమలు చేసి, మిగతావి అమలు కావాలంటే మరోసారి అధికారం కట్టబెట్టండని కోరేవారు. ప్రజలను భ్రమల్లో ఉంచి ఓట్లు దండుకోవడమే తప్ప అంతకుమించి ఆలోచించేవారు కాదు. కానీ గత పాలకుల పాలనకు భిన్నంగా ఎన్నికల మ్యానిఫెస్టోల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు, హామీ ఇవ్వని మరెన్నో పథకాలను అమలు చేయడం ఒక్క కేసీఆర్‌కే చెల్లింది.
వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, డయాలసిస్ రోగులు, హెచ్ఐవీ రోగులు, బోదకాలు బాధితులు, గీత, చేనేత, బీడీ కార్మికుల్లో అర్హులైన 43.68 లక్షల మందికి తెలంగాణ ప్రభు త్వం ప్రతినెల ఆసరా పింఛన్లను అందిస్తున్నది. గతంలో పేదరికం వల్ల తమను పట్టించుకోని కొడుకులపై వృద్ధ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వృద్ధుల పింఛన్‌ను రూ.2016కు పెంచడంతో తల్లిదండ్రులు, వారి కొడుకుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తున్నాయి. లింగ వివక్ష వల్ల ఆడ-మగ నిష్పత్తిలో అంతరం పెరగడం, గర్భస్థ, ఆడ శిశువులను భ్రూణ హత్యలను గమనించిన బీఆర్ఎస్ ప్రభు త్వం ఆడ పిల్లల జీవితాలకు భరోసా ఇవ్వడానికి, పేద తల్లిదండ్రులకు అమ్మాయిల పెండ్లి ఖర్చుల భారం తగ్గించడానికి కల్యా ణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నది. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు, బాలింతలకు కేసీఆర్ కిట్లు, అమ్మ ఒడి వాహనాలు సమకూరుస్తున్నది.
కొన్నాళ్ల్ల కిందట కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కోట్లాది మంది అనారోగ్యం పాలయ్యారు. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తరహా ఆరోగ్య విపత్తులను ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా స్పందించింది. వైద్యరంగాన్ని బలోపేతం చేయడానికి అనేక చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లో నిమ్స్ సహా ఇతర ప్రభుత్వ దవాఖానల స్థాయిని పెంచింది. అదనంగా నగరం నాలుగు దిక్కులా నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలు నిర్మిస్తున్నది. వరంగల్‌లో 24 అంతస్తులతో భారీ హాస్పిటల్ నిర్మిస్తున్నది. అన్ని జిల్లా కేంద్రాలలో ఆధునిక దవాఖానలు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల దవాఖాన, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖానలు; పట్టణ ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలు, డయాలసిస్ సెంటర్లు, తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటుచేసింది. అన్ని సర్కారీ దవాఖానల్లో అధునాతన వైద్య పరికరాలు, అవసరమైన ఔషధాలు, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. 2014లో ప్రభుత్వ దవాఖానల్లో 17 వేల పడకలుండగా 2023 నాటికి వాటి సంఖ్య 34 వేలకు పెరిగింది. త్వరలో 50 వేలకు చేరనున్నది. ఎంబీబీఎస్ సీట్లు 2,850 నుంచి 8,515కు పెరిగాయి. పీజీ సీట్లు 1,183 నుండి 2,890కు పెరిగాయి. గతంలో 5 ఐసీయూలు ఉండగా, నేడు ఆ సంఖ్య 80కు చేరింది. ప్రజల సమగ్ర ఆరోగ్య సమాచారాన్ని హెల్త్ ప్రొఫైల్స్ రూపంలో నిక్షిప్తం చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.
విదేశాల్లో విద్యనభ్యసించే అర్హులైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్ షిప్‌లు అందిస్తున్నది. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచడానికి స్టడీ సర్కిళ్లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల సంఖ్యను గణనీయంగా పెంచింది. 2014లో గురుకులాల సంఖ్య 298 కాగా నేడది 1005కు చేరింది. గురుకులాల్లో చదివే ఒక్కొక్క విద్యార్థి కోసం ప్రభుత్వం ఏటా రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తూ కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నది. వారికి పౌష్టికాహారం అందిస్తూ దేహ దారుఢ్యం పెరగడానికి కృషి చేస్తున్నది.
రైతును రాజును చేయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా, రైతు రుణ మాఫీ వంటి పథకాలను అమలు చేస్తున్నది. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి గోదాములను నిర్మించింది. రైతు సమస్యలను చర్చించడానికి రైతు వేదికలను నిర్మించింది. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది.
వ్యవసాయ రంగం, రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.5 లక్షల కోట్లను ఖర్చు చేసింది. అయిదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి ఏఈవోలను నియమించింది. కాకతీయుల వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని మిషన్ కాకతీయతో దాదాపు 46 వేల జల వనరులను పునరుద్ధరించింది.
ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పాలనలో అనతి కాలంలోనే సంక్షేమంలో, తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్తు వినియోగంలో, పంటల దిగుబడిలో అగ్రగామిగా నిలిచి దేశానికి ఆదర్శమైంది.
సిరికొండ మధుసూదనాచారి
(ఎమ్మెల్సీ,తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్,బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు)