హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ ) : బీసీలకు 42 శాతం కోటా కోసం తెలంగాణ జాగృతి పోరాటం ఫలించింది. ఫూలే యునైటెడ్ ఫ్రంట్‌తో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సాగించిన ఉద్యమంతో సర్కారు దిగొచ్చింది. రాజకీయ, ఉద్యోగ, విద్యారంగాల్లో వేర్వేరుగా రిజర్వేషన్లు కల్పించాలని, లేదంటే చట్టపరమైన చిక్కులు తప్పవని ఏడాది కాలంగా చేస్తున్న డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో వేర్వురు బిల్లులు ప్రవేశపెట్టాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని, అసెంబ్లీ ఆవరణలో జ్యోతిబాఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత ఏడాది కాలంగా పోరాటం కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. బీసీ సంఘాల నాయకులు, మేధావులతో సమావేశాలు నిర్వహించారు. బలహీనవర్గాల్లో చైతన్యం కల్పించడంలో సఫలీకృతులయ్యారు. బీసీలకు స్థానిక, ఉద్యోగ, విద్యారంగాల్లో కలిపి 42 శాతం కోటా ఇస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని పదేపదే అనేక వేదికలపై నొక్కిచెప్పారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పన రాష్ట్రపరిధిలో ఉంటుందని, విద్య, ఉద్యోగ రంగాల్లో కేంద్రం ఆమోదం అవసరమని బలంగా చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో మూడింటికి కలిపి రిజర్వేషన్లు కల్పిస్తే మొదటికే మోసపోవాల్సి వస్తుందని నిరంతరం హెచ్చరించారు. ఇందిరాపార్క్ వేదికగా జరిగిన మహాధర్నాలోనూ బలంగా తన వాణిని వినిపించారు. గత ఫిబ్రవరి నాలుగున శాసనమండలి సమావేశంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. నాలుగురోజుల క్రితం పోస్ట్‌కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వేర్వేరు బిల్లులు తీసుకురావాలని నిర్ణయించింది. కాగా, బీసీ ప్రత్యేక కోటా కోసం కవిత సాగించిన పోరాటంపై బీసీ సంఘాల నాయకులు హర్షంవ్యక్తం చేస్తున్నారు.