హనుమకొండ చౌరస్తా : మేడారం జాతర ( Medaram Jatara ) సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ 4 వేల బస్సులను ( RTC Buses ) నడిపేందుకు చర్యలు తీసుకుంటుందని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్ ( ED Solomon ) వెల్లడించారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగే జాతర సందర్భంగా వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయంలో రీజియన్ పరిధిలోని డిపో మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈడీ మాట్లాడుతూ గత మేడారం జాతరలో ప్రైవేట్ వాహనాలతో ప్రమాదాలు జరిగాయని తెలిపారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి మేడారం వచ్చే భక్తులందరూ ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించాలని కోరారు. ఈ సందర్భంగా డిపోల వారీగా ఆపరేషన్లకు సంబంధించి పలు సూచనలు చేశారు. జాతరకోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు, సిబ్బందికి, ప్రయాణికుల సౌకర్యాల గురించి సమావేశంలో చర్చించారు
. ప్రయాణికులు సురక్షితంగా మేడారం చేరుకొని సమ్మక్క-సారలమ్మ దీవెనలు అందుకోవాలన్నారు. ఆర్టీసీ బస్సులలో మహాలక్ష్మి ఉచిత ప్రయాణం పథకం వర్తిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో వరంగల్ ఆర్ఎం దర్శనం విజయభాను, డిప్యూటీ ఆర్ఎం కేశరాజు భానుకిరణ్, డిప్యూటీ ఆర్ఎం పి.మహేష్, హనుమకొండ బస్‌స్టేషన్ ఏటీఎం మల్లేషయ్య, పీవో సైదులు, డీఎంలు ధరంసింగ్, పి.ఆర్పిత, రవిచందర్, రాంప్రసాద్, ఏ.ఇందు, కే.ప్రసూనలక్ష్మి, కళ్యాణి, స్వాతి, అన్ని డిపోల ట్రాఫిక్, మెకానికల్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.