Pakistan : పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అధిక ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు లోయలో పడటంతో దాదాపు 40 మంది మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. ఈ ఘటన బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని, షెరాణి-ఝోబ్ హైవేపై, దానాసర్ ప్రాంతంలో శుక్రవారం జరిగింది. బస్సు క్వెట్టా నుంచి ఇస్లామాబాద్ వెళ్తుండగా పర్వతాలు కలిగిన రోడ్డులో ప్రమాదం జరిగింది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఒక బస్సు కెపాసిటీకి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకుని హైవేపై వెళ్తోంది. ఇది సరిహద్దు ప్రాంతాలైన బలూచిస్తాన్, ఖైబర్ పక్తుంఖ్వాలను కలిపే రోడ్డు.
అయితే, ఈ రోడ్డు చాలా ప్రమాదకరం. పర్వత ప్రాంతం కావడం, రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడ అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో ఒకటిగా నిలిచింది. అలాంటి ప్రదేశంలో పర్వత మార్గంలో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 40 మంది ప్రయాణికులు మరణించగా, మరో 8 మంది గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసుల, రెస్క్యూ, వైద్య బృందాలు అక్కడికి చేరుకున్నాయి. సహాయక చర్యలు ప్రారంభించాయి. బస్సు శిథిలాల నుంచి 40 మంది మృతదేహాల్ని వెలికితీశారు. గాయపడ్డవారిని స్థానిక ఝోబ్ పట్టణంలోని ఆస్పత్రులకు చికిత్స కోసం తరలించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రమాద స్తలంలో అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ వైద్యబృందం, లైట్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్‌ను అధికారులు సిద్ధం చేశారు.
అయితే, పర్వత ప్రాంతం, పెద్ద లోయ కావడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ అంశంపై షెరాణి డిప్యూటీ కమిషనర్ హజ్రత్ మాట్లాడారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. బస్సు మొదట 36 మందితోనే బయల్దేరిందని, అయితే, మార్గమధ్యలో మరికొందరు ప్రయాణికుల్ని ఎక్కించుకుందన్నారు. అందువల్లే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాలు సరిగ్గా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.