England : మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఫైట్‌కు మరో రెండు రోజులే ఉంది. లీగ్ దశను అజేయంగా ముగించి.. సెమీఫైనల్లో చెలరేగిన ఇంగ్లండ్ (England), ఆస్ట్రేలియా(Australia) టైటిల్ పోరుకు సిద్ధమవుతున్నాయి. సొంతగడ్డపై ఘనమైన రికార్డు ఇంగ్లండ్‌కు అనుకూలంగా ఉండడంతో.. ఆసీస్‌కు కష్టమే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. ఇప్పటివరకూ నాలుగు పర్యాయాలు స్వదేశంలో ఐసీసీ ట్రోఫీని వదల్లేదు ఇంగ్లండ్. ఆరుసార్లు ఛాంపియన్ కంగారూ టీమ్ అవకాశాల్ని కొట్టిపారయలేమని మరికొందరి వాదన. ఈ నేపథ్యంలో ఆదివారం లార్డ్స్ వేదికగా జరుగనున్న ఫైనల్లో ఆతిథ్య జట్టు జైత్రయాత్రకు సోఫీ మొలినెక్స్ బృందం చెక్ పెడుతుందా? అనేది ఆసక్తి రేపుతోంది.
పదో సీజన్ మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ కప్‌పై కన్నేసింది. స్వదేశంలో ఇప్పటివరకూ ఐసీసీ వరల్డ్‌కప్(వన్డే/టీ20) ట్రోఫీని వదలని ఇంగ్లండ్ ఈసారి కూడా ఆనవాయితీని కొనసాగించాలనే కసితో ఉంది. అందుకుతగ్గట్టే దుమ్మురేపే ఆటతో ఫైనల్‌కు దూసుకెళ్లింది నాట్ సీవర్ బ్రంట్ సేన. పొట్టి ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు ఇది ఐదో ఫైనల్. గతంలో 2009, 2012, 2014, 2018లో ఫైనల్ ఆడింది ఇంగ్లిష్ టీమ్.
England versus Australia in a Lord’s final. You don’t want to miss this 🍿#T20WorldCup pic.twitter.com/p1wGURWIlp
— Cricinfo (@cricinfo) July 2, 2026
ఐసీసీ 2009లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్ ఇంగ్లండే. చార్లొట్టే హెడ్వర్డ్స్ కెప్టెన్సీలో అదరగొట్టిన న్యూజిలాండ్‌ను చిత్తు చేసి మొట్టమొదటి పొట్టి ఛాంపియన్‌గా అవతరించింది. అంతకుముందు.. స్వదేశంలో జరిగిన మూడు వన్డే ప్రపంచకప్‌లను పట్టేసింది. 1973లో రాచెల్ హెహో ఫ్లింట్ (Rachael Heyhoe-Flint) కెప్టెన్సీలో వన్డే ప్రపంచకప్‌ను ఒడిసిపట్టిన ఇంగ్లండ్.. 1993లో కరెన్ స్మితీస్ (Karen Smithies) నాయకత్వంలో వన్డే ఛాంపియన్‌గా నిలిచింది.
England have won all four previous Women’s World Cups on English soil, and are now just one win away from making it five from five 🏆 pic.twitter.com/WXxTxXBmBg
— Cricinfo (@cricinfo) July 3, 2026
2017లో హీథర్ నైట్ సారథ్యంలో ఇంగ్లండ్ మరోసారి వన్డే కప్‌ను ముద్దాడింది. సొంతగడ్డపై జరిగిన నాలుగు వరల్డ్‌కప్‌లను తన్నుకుపోయిన ఇంగ్లండ్.. ఈసారి ఆస్ట్రేలియాను ఓడించి ఐదో కప్‌తో మురవాలనే పట్టుదలతో ఉంది. కానీ, ప్రత్యర్థి ఆరుసార్లు ఛాంపియన్ కావడంతో స్వదేశంలో వరల్డ్‌కప్ రికార్డు కాపాడుకోవడం బ్రంట్ సేనకు సవాలే. బలాబలాల పరంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా రెండు సమఉజ్జీలుగా ఉన్నాయి. దాంతో.. లార్డ్స్‌లో బిగ్ ఫైట్‌లో విజేతను ఊహించడం పొరపాటే అవుతుందేమో.