హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటికి బదులు 4 లేబర్ కోడ్లను అమలుచేస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి ప్రకటించడాన్ని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ)రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తప్పుబట్టారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పార్లమెంట్లో చట్టం చేసిన 29 కార్మిక చట్టాలను రద్దు చేసిందని పేర్కొన్నారు. వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకొచ్చిన ఈ నెల 21ని చీకటిరోజుగా పరిగణిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కార్మిక వర్గానికి ఉద్యోగ భద్రత కొరవడుతుందని మండిపడ్డారు. ముఖ్యంగా ఓటీ, 8 గంటల పని విధానాలు రద్దవుతాయని విమర్శించారు. కార్మిక సంఘాల ప్రాధాన్యత తగ్గడంతోపాటు వారి సామాజిక భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తంచేశారు, కేంద్ర సర్కార్ మొండివైఖరిని నిరసిస్తూ బీఆర్టీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం నాయకులు మారయ్య, నారాయణ, లక్ష్మణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.