హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం 4 కార్మిక కోడ్లను ఏకపక్షంగా అమలు చేయటం పత్రికా స్వేచ్ఛపై నేరుగా దాడి చేయటమేనని, ప్రజాస్వామ్యంలో మీడియా పోషించే కీలక పాత్రను బలహీనపరచటమేనని తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి, ఐజేయూ కోశాధికారి ఆసాని మారుతీసాగర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నిర్ణయం భారతదేశంలో జర్నలిస్టులు, మీడియా కార్మికులు, అలాగే పత్రికా స్వేచ్ఛపై దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎకువగా ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు వారు శనివారం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. కొత్తగా అమల్లోకి వచ్చిన కార్మిక కోడ్లు 1955లోని వరింగ్ జర్నలిస్ట్స్, న్యూస్పేపర్ ఎంప్లాయీస్ (కండిషన్స్ ఆఫ్ సర్వీస్) అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్, 1958లోని వరింగ్ జర్నలిస్ట్స్ (ఫిక్సేషన్ ఆఫ్ రేట్స్ ఆఫ్ వేజెస్) యాక్ట్ అనే రెండు చారిత్రక చట్టాలను మాయం చేశాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులు దశాబ్దాలపాటు చేసిన పోరాటాల ద్వారా సాధించిన చట్టాలను ఏకపక్షంగా రద్దు చేయడం అన్యాయమని అన్నారు. కార్మిక, మీడియా వ్యతిరేక కోడ్లపై కార్మిక సంఘాలతో కలిసి ఉద్యమబాట చేపడతామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు స్వేచ్ఛా, స్వతంత్ర జర్నలిజానికి పునాది అయిన హకులు కాపాడుకొనేందుకు అప్రమత్తంగా, ఐక్యంగా ఉందామని టీ యూడబ్ల్యూజే పిలుపునిస్తుందని తెలిపారు.