తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి వైభవాన్ని ఈశాన్య భారతదేశంలో మరింత విస్తరించేందుకు టీటీడీ ( TTD ) చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా అస్సాం రాష్ట్రంలోని గువాహటి (Guwahati ) నగరంలో 10.8 ఎకరాల భూమికి బదులుగా 25 ఎకరాల భూమిని కేటాయించేందుకు అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గువాహటి సమీపంలోని కామ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో 10.8 ఎకరాల భూమిని కేటాయించేందుకు అస్సాం ప్రభుత్వం గతంలోనే అంగీకారం తెలిపింది. డిసెంబర్ 7న అస్సాం ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి కేకే ద్వివేది టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ( BR Naidu ) కు లేఖ రాస్తూ కామ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో టీటీడీ వేంకటేశ్వర ఆలయం నిర్మిస్తే, అక్కడ ఉన్న ఆలయ ప్రయోజనాలకు భంగం కలగవచ్చని అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో వేంకటేశ్వర ఆలయాన్ని అస్సాంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సిల్చార్, డిబ్రూగఢ్ నగరాల్లో ఏర్పాటు చేయాలని అస్సాం సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి సూచించారు. సిల్చార్ లేదా డిబ్రూగఢ్ బదులుగా అస్సాం రాజధాని గువాహటిలోనే టీటీడీకి 25 ఎకరాల భూమి కేటాయించాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరిన మీదట అస్సాం ముఖ్యమంత్రి గువాహటిలోనే ఆలయం ఏర్పాటుకు అంగీకారం తెలిపారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, అస్సాం ముఖ్యమంత్రులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. భూమి కేటాయింపునకు సంబంధించిన విధివిధానాలను పూర్తి చేసి, ఈశాన్య భారతదేశంలో తొలి వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించేందుకు అస్సాం ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటామని చైర్మన్ బీ.ఆర్.నాయుడు స్పష్టం చేశారు.