వర్ధన్నపేట, మార్చి 11 : రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌పై జపాన్ దేశానికి చెందిన జైకా సంస్థ ప్రతినిధి సర్వే నిర్వహించారు. శుక్రవారం వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లోని పలు గ్రామాల రైతులను కలిసి 24 గంటల విద్యుత్ సరఫరా, జైకా ఆర్థిక సహకారంతో ఎన్పీడీసీఎల్ ఏర్పాటు చేసిన 25 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల పనితీరును ఆ సంస్థ ప్రతినిధి చిమునేమోరీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2016-17 సంవత్సరంలో తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న విద్యుత్ సంస్కరణలకు జపాన్ దేశానికి చెందిన ‘జైకా’ రూ.351 కోట్ల ఆర్థిక సహాయం అందించిందన్నారు. ఈ మొత్తాన్ని ఎన్పీడీసీఎల్ ద్వారా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్నదన్నారు. ఎన్పీడీసీఎల్ 100 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుతో ఏ విధంగా మేలు జరిగిందనే విషయాన్ని నేరుగా రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. గతంలో 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లు పలుమార్లు కాలిపోవడంతో ఇబ్బందులు ఏర్పడేవని, 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుతో విద్యుత్ సరఫరా మెరుగైందని రైతులు వివరించారు. ప్రభుత్వం 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుండడంతో పంటలు సమృద్ధిగా పండుతున్నాయని రైతులు ఆమెకు తెలిపారు. ఎన్పీడీసీఎల్కు జైకా ద్వారా మరింత ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చిమునేమోరి తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ వరంగల్ రూరల్ డీఈ మల్లికార్జున్, ఎన్పీడీసీఎల్ ప్రాజెక్టు డీఈ జానకీరాంరెడ్డి, ఏఈలు దయాకర్, రాజశేఖర్, అజయ్, విద్యుత్ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.