భువనేశ్వర్: బీజేపీ పాలిత రాష్ట్రం ఒడిశాలోని (Odisha) మయూర్భంజ్ జిల్లాలో దారుణం చోటచేసుకున్నది. తెలిసినవాళ్లే కదా అని కారు ఎక్కితే సామూహిక లైంగికదాడి చేసి నడిరోడ్డుపై వదిలేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం సాయంత్రం మయూర్భంజ్ జిల్లా బంగిరిపొసి ప్రాంతంలో 22 ఏండ్ల యువతిని ఇద్దరు వ్యక్తులు కారులో ఎక్కించుకున్నారు. ఇంతకుముందే వారిరువురు ఆమెకు తెలిసి ఉండటంతో ఎలాంటి సందేహం లేకుండా కారులో ఎక్కింది. అనంతరం కొద్ది దూరం వెళ్లిన తర్వాత మరో ముగ్గురు వ్యక్తులు ఆ కారులో ఎక్కారు. పక్కా ప్లాన్ ప్రకారం ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే బంగిరిపొసిలోని ఆమె నివాసానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడాలా సమీపంలో ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు.
అనంతరం వారంతా కలిసి ఆమెపై లైంగికదాడి చేశారు. ఆ తర్వాత బాధితురాలిని నడిరోడ్డుపై వదిలి వెళ్లారు. శనివారం తన స్వస్థలానికి చేరుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నామని అధికారులు వెల్లడించారు.