ఆసియాకప్ ఫైనల్.. పాక్‌ను భారత్ మట్టి కరిపించింది. దీపావళి ముందే వచ్చేసింది. వినువీధుల్లో తారాజువ్వలు.. వెలుగులు చిమ్మాయి. భారతీయుల వాట్సాప్ స్టేటస్ బ్లూ రంగులోకి మారిపోయింది. మహిళా క్రికెట్ వరల్డ్ కప్ ఈవెంట్. సెమీస్‌లో దిగ్గజ ఆసీస్‌పై అబ్బురంగా గెలించింది మన జట్టు. ఫైనల్‌కు ఘనంగా చేరింది. అయినా, ఏ వీధిలోనూ చడీచప్పుడు లేదు. దీపావళికి తెచ్చిన టపాసులు ఇంకా ఉన్నా.. పెద్దగా కాల్చిందీ లేదు. ఈ చిన్నచూపు ఇంకొన్ని గంటలే.. మన సివంగులు.. ఫైనల్లో సఫారీలను జయించే వరకే! ఆ తర్వాత క్రికెట్లో పురుషులు గ్రేట్.. మహిళలు కాస్త తక్కువ గ్రేట్ అనే మాట ఉండదిక! ఆల్ ఆర్ ఈక్వల్.. అనాల్సిందే! అమ్మాయిలూ… మీరు గెలిస్తే, ఆటలోనే కాదు… అన్నిటా ఈ ఈక్వేషన్ పాసవుతుంది.
భారత్‌లో క్రికెట్ ఓ అనధికారిక మతం! దేశంలోని కోటానుకోట్ల మందికి అది కేవలం ఒక ఆట మాత్రమే కాదు.. అంతకుమించి ‘లార్జర్ దెన్ లైఫ్ వంటి ఎమోషన్’! పురుషాధిక్యత వేళ్లూనుకుపోయిన భారత సమాజంలో మెన్స్ క్రికెటర్లకు ఉన్న క్రేజ్‌తో పోలిస్తే మహిళల ఆట పట్ల ఇప్పటికీ చిన్నచూపే. శాంతా రంగస్వామి, డయానా ఎడుల్జి మొదలుకుని మిథాలీ రాజ్, జులన్ గోస్వామి వంటి నిన్నటి తరం క్రికెటర్లు.. హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ లాంటి నేటి తరం ఆటగాళ్లు మహిళా క్రికెట్‌ను ఒక్కో మెట్టు పైకి ఎక్కిస్తున్నారు. అమ్మాయిల ఆట పట్ల ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ప్రస్తుతానికి స్వదేశంలో జరుగుతున్న ఉమెన్స్ వన్డే వరల్డ్‌కప్ మాత్రం అభిమానుల్లో ఆ దృక్పథాన్ని కొంతవరకైనా మార్చింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ అయితే సగటు భారత ప్రేక్షకుడికి ఉమెన్స్ క్రికెట్ పట్ల ఉన్న అపనమ్మకాన్ని పోగొట్టగలిగింది.

ఐసీసీ ఈవెంట్లలో భారత అమ్మాయిల జట్టుకు గొప్ప రికార్డేమీ లేదు. ఇప్పటిదాకా 12 ఎడిషన్లుగా (ప్రస్తుతం జరుగుతున్నది 13వ ఎడిషన్) జరిగిన వన్డే ప్రపంచకప్‌లలో 10సార్లు ఆడి ఐదు సార్లు గ్రూప్ దశకు పరిమితమైంది. నాలుగు సార్లు మాత్రమే నాకౌట్ స్టేజ్‌కు చేరుకుంది. 2005, 2017లో ఫైనల్ చేరి కప్పుపై ఆశలు రేపినా తుది మెట్టుపై తడబడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. టీ20 వరల్డ్ కప్ (9 ఎడిషన్లు)లలోనూ ఇదే తంతు. 2020లో ఒకసారి రన్నరప్‌గా నిలవడం మినహాయిస్తే మిగిలిన ఎడిషన్లలో అభిమానులకు నిరాశ, నిస్పృహలే మిగిలాయి.
సొంతగడ్డపై ప్రపంచకప్ నెగ్గాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ సేన.. టైటిల్ ఫేవరేట్లలో ఒకరిగా నిలిచినా గ్రూప్ దశలో మన అమ్మాయిల ఆట చూస్తే అసలు సెమీస్ అయినా చేరుతారా? అన్న అనుమానం వచ్చింది. బలహీన జట్లయిన బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్‌పై విజయాలు మినహా పటిష్ఠమైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాపై ఓటములు తప్పలేదు. ఆసీస్‌తో భారీ స్కోరు (330) చేసినా బౌలింగ్ వైఫ్యలంతో అపజయం వైపు నిలిచిన ‘ఉమెన్ ఇన్ బ్లూ’.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌తో మాత్రం చేతికందిన విజయాలను చేజేతులా వదిలేసుకుంది. ఇంగ్లండ్‌తో అయితే గెలుపు అంచుల దాకా వచ్చి.. ఆఖర్లో తడబాటుతో 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. స్టార్ బ్యాటర్లు మంధాన, హర్మన్ విఫలమవడం.. మ్యాచ్‌లను ముగించే ఫినిషర్ కొరవవడం జట్టును దెబ్బతీసింది. దీంతో సెమీస్ ఆశలు గల్లంతయ్యే పరిస్థితి! కానీ న్యూజిలాండ్‌తో గెలుపు భారత్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచింది.
సెమీస్‌కు వచ్చినా అక్కడ ఉన్నది ఏడుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా. అదీగాక ఈ టోర్నీలో అజేయ జట్టు. ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టు మనల్ని ఎన్నిసార్లు ఏడిపించిందో (2023 పురుషుల వన్డే ప్రపంచకప్‌లోనూ) ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. నాకౌట్ దశలో అయితే వాళ్లు అంచనాలకు మించి రాణించడంలో దిట్ట. ఏమాత్రం అవకాశం దొరికినా మ్యాచ్‌ను తమవైపునకు లాగేసుకోవడంలో అందెవేసిన చేయి. దీంతో కంగారూల గండాన్ని మన అమ్మాయిలు దాటగలరా? అన్న అనుమానాలు. అందుకు తగ్గట్టుగానే ఈ మ్యాచ్‌కు ముందు టోర్నీలో మంచి ఫామ్ కనబర్చిన ప్రతీక గాయంతో దూరమవడం.. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కంగారూలు ఏకంగా 339 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం.. ఛేదనలో 59కే రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో ‘ఇక కష్టమే!’ అనుకున్నారంతా. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ముంబయి అమ్మాయి జెమీమా రోడ్రిగ్స్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడింది. చూడటానికి బక్కపల్చగా ఉండే ఈ అమ్మాయి.. 140 కోట్ల మంది ఆశలను తన భుజాలపై మోస్తూ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. భారత్ తరఫున ఐసీసీ ఈవెంట్లలో మేటి ఇన్నింగ్స్‌ల్లో ఇదీ ఒకటని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం అక్కర్లేదు. కీలకపోరులో సారథి హర్మన్‌ప్రీత్ తన అనుభవన్నంతా రంగరించి.. జెమీమాతో 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయానికి బాటలు వేసింది. రిచా, దీప్తి, చరణి, అమన్‌జ్యోత్.. ఇలా తలా ఓ చేయి వేసి జట్టును ఫైనల్ చేర్చారు.

1983లో కపిల్ డెవిల్స్ ప్రపంచకప్ విజయాన్ని చూసి సచిన్ బ్యాట్ పట్టాడట. అదే సచిన్.. తదనంతర కాలంలో భారత క్రికెట్‌కు దేవుడయ్యాడు. అతని బ్యాటింగ్ విన్యాసాలను చూసి దేశంలో లక్షలాది మంది ఈ ఆటను తమ కెరీర్‌గా ఎంచుకున్నారు. ధోనీ, యువరాజ్, హర్భజన్, సెహ్వాగ్ వంటి స్టార్లు మొదలుకుని ప్రస్తుతం జాతీయ జట్టులో దిగ్గజాలుగా వెలుగొందుతున్న రోహిత్, కోహ్లీ వరకూ అంతా మాస్టర్ బ్లాస్టర్ ఆట నుంచి స్ఫూర్తి పొందినవారే. 2011 వన్డే ప్రపంచకప్ విజయం సైతం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లకూ మూడు జట్లను తయారుచేసుకుంటూ రెండో స్థాయి జట్టునూ విదేశీ పర్యటనలకు పంపే స్థితిలో బీసీసీఐ ఉందంటే ఈ విజయాలే కారణం. ఇదే స్ఫూర్తిగా నేడు జరుగబోయే ఫైనల్లో హర్మన్‌ప్రీత్ అండ్ కో. ఈ రోజు చెలరేగి ఆడాలి. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఎన్నో ఏండ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఐసీసీ టైటిల్‌ను సొంత అభిమానుల ఎదుట సగర్వంగా ముద్దాడితే దేశంలో అమ్మాయిల క్రికెట్ దశ తిరిగినట్టే!
మీ ఆటతీరుకు స్ఫూర్తి పొంది మరో సచిన్ రావాలి.మగువల తెగువ చూసి మరో ధోని తయారవ్వాలి.మరో మంధాన, కౌర్, షెఫాలీ క్రికెట్ గ్రౌండ్లోకి అడుగుపెట్టాలి. మీ విజయం.. క్రికెట్‌కే కాదు.. అన్ని రంగాల్లోనూ స్త్రీశక్తిని చాటి చెప్పాలి. ఆల్ ద బెస్ట్ టు భారత్!
– శ్రీను మునిగాల