బాలీవుడ్ చరిత్రలో ఎన్నో గొప్ప ప్రేమకథలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని సుఖాంతమైతే.. మరికొన్ని దుఃఖాంతాలుగా మిగిలిపోయాయి. అలాంటి వాటిలో సల్మాన్ ఖాన్-ఐశ్వర్య పేరుకూడా ఉంటుందని అంటున్నాడు సీనియర్ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ ప్రహ్లాద్ కక్కర్. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రహ్లాద్ మాట్లాడుతూ.. ఐశ్వర్య రాయ్ సినీ ప్రయాణం గురించి కొన్ని ముచ్చట్లను పంచుకున్నాడు. ‘ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్న ఐశ్వర్య రాయ్.. చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నది. సంజయ్ లీలా భన్సాలీ చిత్రాల ద్వారా ఆమె సూపర్ స్టార్డమ్ ప్రయాణాన్ని నా కళ్లారా చూశాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ‘నిజానికి ఐశ్వర్య పబ్లిక్ పర్సన్ కాదు. ఆమె చాలా ప్రైవేట్ వ్యక్తి. ఎవరి ముందు కూడా మనసు విప్పి మాట్లాడదు.
ఆమెను నమ్మే సన్నిహితులు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటివారి వద్దే.. ఆమె అన్ని విషయాలూ పంచుకుంటుంది’ అని వెల్లడించాడు. అయితే, ఆ స్వభావం కారణంగానే ఐశ్వర్యను మీడియా తప్పుగా అర్థం చేసుకున్నదట. ‘మీడియావాళ్లకు ఎవరితోనైనా మాట్లాడే అవకాశం రాకపోతే.. వారిని చెడుగా చూపించడానికి ప్రయత్నిస్తారు. ఐశ్వర్య విషయంలోనూ అదే చేశారు’ అంటూ నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు.
ముఖ్యంగా.. 1990-2000ల మధ్యలో బాలీవుడ్ స్టార్హీరో సల్మాన్ ఖాన్‌తో ప్రేమాయణంతో ఐశ్వర్య ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నదని చెప్పాడు. ‘దయ, ప్రశాంతతకు మారుపేరుగా ఐశ్వర్య ఉండేది. ఆ క్లిష్ట సమయంలో మౌనాన్నే తన బలమైన ప్రతిస్పందనగా ఎంచుకునేది. స్వభావరీత్యా చాలా ప్రైవేట్‌గా ఉండే ఆమె.. తనను తాను బహిరంగంగా సమర్థించుకోవాలనీ, తమ ప్రేమ విషయం గురించి అందరికీ వివరించాలనీ ఎప్పుడూ అనుకోలేదు. అయితే, ఇలా మౌనంగా ఉండటం.. అప్పటి మీడియాకు నచ్చలేదు. దాంతో, వారు నిరంతరం ఆమెను కించపరచడానికి, విమర్శించడానికి ప్రయత్నించారు’ అంటూ వెల్లడించాడు.
సల్మాన్-ఐశ్వర్యల ప్రేమకథ ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సెట్లో ప్రారంభమైంది. అక్కడ వారి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ కూడా నిజ జీవిత సంబంధంగా మారింది. అయితే, ఇది కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. విడిపోయిన తర్వాత, ఐశ్వర్య రాయ్ 2007లో నటుడు అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకుంది. మరోవైపు సల్మాన్ ఖాన్.. దాదాపు 60 ఏళ్ల వయసులో కూడా అవివాహితుడిగానే ఉన్నాడు. వీరి ప్రేమకథ ముగిసి రెండు దశాబ్దాలు గడుస్తున్నా.. అది ఇంకా అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నది.