ప్రస్తుతం బాలీవుడ్లో ‘స్టార్డమ్’ అనేదే లేదని అంటున్నది బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్ రావు. అందరూ కష్టపడాల్సిందేననీ, అప్పుడే విజయం దక్కుతుందనీ చెబుతున్నది. ఇటీవల ఓ జాతీయ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడింది. బీటౌన్‌లో అడుగుపెడుతున్న కొత్త నటీనటులు, నెపో కిడ్స్, స్టార్డమ్ తదితర విషయాల గురించి తన అభిప్రాయాలను కిరణ్‌రావ్ పంచుకుంటూ.. ‘బాలీవుడ్లో క్రేజీ యాక్టర్ల రెమ్యునరేషన్ అధికంగా ఉంటున్నది. దాంతో, సినిమా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.
బడ్జెట్‌ను కాపాడుకోవడానికి కొత్త వారిని తీసుకుంటున్నాం!’ అని చెప్పుకొచ్చింది. గతేడాది కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన ‘లాపతా లేడీస్’ చిత్రంలో ముగ్గురు కొత్త నటులను ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వారు కట్టుబట్టలతో బీటౌన్‌లో అడుగుపెట్టినవారని కిరణ్‌రావు చెప్పింది. ‘నా సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉండాలని కోరుకుంటా. ఆవిధంగానే సినిమాలు తీస్తా. ధోబీ ఘాట్ నుంచి లాపతా లేడీస్ వరకూ.. నా చిత్ర నిర్మాణం చాలా స్వతంత్రంగా ఉంటుంది’ అని వెల్లడించింది.
ఇక సెట్లో ఉండే ప్రతి ఒక్కరినీ సమానంగా చూసుకుంటామనీ, ఎవరికీ స్టార్‌డమ్‌ను అంటగడుతూ.. ప్రత్యేక సపర్యలు ఉండబోవనీ చెప్పుకొచ్చింది. పని గంటల వివాదంపైనా స్పందిస్తూ.. ‘న్యాయమైన పని గంటలు ఉండాలని నేను కూడా నమ్ముతా. అదే సమయంలో తక్కువ వనరులతోనే, సమయం వృథా కాకుండా ఉండటానికి ప్రయత్నిస్తా. అందుకోసం కాస్త కఠినంగానే ఉంటాం’ అని తన అభిప్రాయాన్ని వెల్లడించిది. ఇక ఇండస్ట్రీని ఎప్పటినుంచో పట్టిపీడిస్తున్న నెపోటిజం గురించీ మాట్లాడింది.
‘నెపోకిడ్ పరిశ్రమలోకి వచ్చినప్పుడు.. ఔట్ సైడర్స్‌కు లేని ఎన్నో వెసులుబాట్లు, సౌకర్యాలు వారికి ఉంటాయి. వారంతా సత్వర మార్గాల్లోనే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. కానీ, చాలా సందర్భాలలో వారి ప్రయాణం కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే.. వారిపై ఎన్నో అంచనాలు ఉంటాయి. అవన్నీ నెపోకిడ్స్పై తప్పించుకోలేని ఒత్తిడిని పెంచుతాయి’ అని వెల్లడించింది. అదే సమయంలో కొత్తవారికీ కొన్ని అనుకూలతలు ఉంటాయని చెప్పింది. వారిపై ప్రజలకు ఎలాంటి అవగాహన ఉండదనీ, వారి బలాలు, బలహీనతల గురించి పూర్తిగా తెలియదు కాబట్టి, అలాంటి వారు ఎదగడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. అంతిమంగా.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ప్రతిభ అనేదే ముఖ్యమనీ, ఇక్కడ పని మాత్రమే మాట్లాడుతుందనీ, సినిమా విజయవంతం కావడానికి ప్రతిభే కొలమానం అవుతుందనీ చెప్పుకొచ్చింది.